చేప పిల్లల టెండర్లలో లీడర్ల రింగాట!

చేప పిల్లల టెండర్లలో లీడర్ల రింగాట!
  • చేపపిల్లల సప్లై టెండర్లలో లీడర్ల రింగాట!
  • కాంట్రాక్టర్ల అవతారమెత్తిన గులాబీ నేతలు
  • పెంచిన రేట్లు చాలవని టెండర్ల బాయ్​కాట్
  • తెర వెనుక చక్రం తిప్పుతున్న మత్స్యశాఖ ‘పెద్దలు’
  • కోట్లలో సర్కారు సొమ్ము దోచుకునేందుకు ప్లాన్​

ఖమ్మం/మంచిర్యాల/సూర్యాపేట, వెలుగు: చేప పిల్లల సప్లై కాంట్రాక్టర్ల అవతారమెత్తిన గులాబీ లీడర్లు.. కోట్లలో సర్కారు సొమ్ము దోచుకునేందుకు పక్కా ప్లాన్​ ప్రకారం ముందుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువుల్లో చేప పిల్లలను సప్లై చేసేందుకు గురువారం రెండోసారి పిలిచిన ఆన్​లైన్ టెండర్లలో పాల్గొనకుండా బాయ్​కాట్ చేశారు. రేటు గిట్టుబాటు కాదనే కారణంతో ఒక్కటంటే ఒక్క బిడ్​ కూడా దాఖలు చేయలేదు. దీంతో టెండర్లను రద్దు చేసిన ఫిషరీస్ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు రీ టెండర్లు పిలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే చేప పిల్లల రేటును పెంచితే తప్ప టెండర్లు వేయబోమని కాంట్రాక్టర్లు అంటున్నారు. రూలింగ్ పార్టీ లీడర్లే మత్స్యశాఖలోని కొందరు ‘పెద్దలు’, ఆఫీసర్ల సహకారంతో ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. రేట్లు పెంచి కోట్లలో దోచుకునేందుకు లోపాయికారి మంతనాలు సాగిస్తున్నారు. ఏ జిల్లాకు ఎవరు, ఎంత రేటుకు టెండర్​వేయాలో కూడా వారే నిర్ణయించి రేట్ల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో టెండర్ ప్రాసెస్ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వర్షాలు ప్రారంభమై చెరువులు, ప్రాజెక్టులు నిండుతున్నాయి. టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో చేప పిల్లలు వేసే టైమ్ దాటుతోందని మత్స్యకారులు టెన్షన్ పడుతున్నారు. 

ఈసారి 93 కోట్ల చేప పిల్లలు
రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్ లో 28,704  నీటి వనరుల్లో 93 కోట్ల చేప పిల్లలను వేయాలని మత్స్య శాఖ నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని 
రిజర్వాయర్లు, చెరువుల్లో వదిలేందుకు 3.90 కోట్ల చేప పిల్లలు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలోని 371 ట్యాంకులు, మూడు రిజర్వాయర్లలో 2.24 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. ఇందులో 35–-40 మిల్లీమీటర్లు (ఎంఎం) 1.24 కోట్లు, 80-–100 ఎంఎం 99.58 లక్షలు కావాలని ప్రపోజల్స్​ పంపారు. సూర్యాపేట జిల్లాలో ఏకంగా 4.10 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా జిల్లాల వారీగా ప్రపోజల్స్​ ప్రభుత్వానికి అందగా, ఆ మేరకు టెండర్లు పిలిచారు. కానీ  తెలంగాణలో సీడ్​ఎక్కడా అందుబాటులో లేదు. ఏపీలోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలే చేప పిల్లలకు ఫేమస్.​. అందుకే జిల్లాల్లో కాంట్రాక్టు ఎవరు దక్కించుకున్నా పిల్లలను మాత్రం ఏపీ నుంచి తీసుకురావాల్సిందే. దీంతో కొన్నేండ్లుగా కొందరు గులాబీ లీడర్లు, మత్స్యశాఖ పెద్దల ఆశీస్సులతో ఫిష్​ సీడ్ సప్లై కాంట్రాక్టులు పొందుతున్నారు. పాత రేట్లపైనే 10 శాతం మార్జిన్​వస్తోందనే అంచనాలున్నాయి. ఈసారి ట్రాన్స్​పోర్టేషన్, ఆక్సిజన్​చార్జీలు పెరిగినందున ఆమేరకు ప్రభుత్వం రేట్లను సవరించింది. అవి కూడా సరిపోవని, మరింత రేట్ పెంచడంతో పాటు రూల్స్​ సడలించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఒక్కో లారీకి 60 వేల పిల్లలను లెక్కిస్తుండగా, లక్షకు పెంచాలని డిమాండ్​ చేస్తున్నారు. 

అనుకున్న రేటొచ్చేదాక  ఇదే సీన్?
ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా కట్ల, రోహు, మృగాల, కామన్ షార్క్ రకాలకు సంబంధించిన రెండు సైజుల పిల్లల కోసం ఆన్ లైన్ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. 80–100 ఎంఎం సైజున్న పిల్లలకు ఈ ఏడాది ఒక్కోదానికి రూ.1.50 చొప్పున రేట్ ఫిక్స్ చేసింది. నిరుటి కంటే ఈసారి40 పైసలు రేటు పెంచింది. ఇక 35–40 ఎంఎం సైజున్న పిల్లల రేటును 50 పైసల నుంచి 60 పైసలకు పెంచింది. అయితే ఈ రేట్ తమకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు అంటున్నారు. పెద్ద సైజు పిల్లల రేటును కనీసం రూ.1.80కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా కారణంగా చేప పిల్లలు దొరకడం లేదని, అనుకున్న రేటు ఇస్తే తప్ప టెండర్లు వేయబోమని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  కాంట్రాక్టర్లంతా ఒక్కటై అనుకున్న రేట్ ఇచ్చేదాక బిడ్లు దాఖలు చేయవద్దని భీష్మించుకున్నట్లు తెలిసింది. గురువారం ఏ ఒక్క జిల్లాలోనూ బిడ్​దాఖలు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. వీరికి మత్స్యశాఖలోని ‘పెద్దలు’, ఆఫీసర్లు కూడా సపోర్టు చేస్తున్నందున రేట్లు పెంచి టెండర్లు రీకాల్ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదే జరిగితే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం తప్పేలా లేదు.

టెండర్లు రాలేదు.. 
చేప పిల్లల సప్లై కోసం ఆన్ లైన్ టెండర్లు పిలిస్తే, ఎవరూ ముందుకు రాలేదు. తమకు రేటు గిట్టుబాటు కావడం లేదని, రేటు పెంచాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మళ్లీ టెండర్లపై నిర్ణయం తీసుకుంటాం.  

– షకీలా భానో, ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి