టికెట్ల కోసం టీఆర్​ఎస్​ నేతల పోటీ

టికెట్ల కోసం టీఆర్​ఎస్​ నేతల పోటీ
  • మునుగోడులో పోటీ పడుతున్న టీఆర్​ఎస్​ నేతలు
  • మాజీ ఎంపీ బూర నర్సయ్యకు హైకమాండ్ పిలుపు

నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలబడేందుకు టీఆర్ఎస్ లీడర్లు పోటీ పడుతున్నారు. పలువురు ఆశావహులు పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తమకున్న అనుకూలతలు, సామాజిక బలాబలాల గురించి వివరిస్తున్నారు. మునుగోడులో పోటీ చేసేందుకు ఆరుగురు ఆసక్తి చూపిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు టికెట్​కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​కు గురువారం హైకమాండ్​నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు పార్టీ అధిష్టానం తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అస్వస్థతకు గురైనందున మునుగోడు వ్యవహారాలను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో లోకల్ లీడర్ల కదలికల మీదా నిఘా వేసింది. 

బీసీలకే ఇవ్వాలి...
బీసీలకే ఇవ్వాలని మునుగోడులో బీసీ సామాజిక వర్గం బలంగా ఉన్నందున బీసీ లీడర్​కే ఈసారి అవకాశం ఇవ్వాలన్న వాదన స్థానిక నేతల నుంచి వినిపిస్తోంది. మునుగోడు మీద కన్ను వేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇటీవల తన బర్త్​డే వేడుకలను చౌటుప్పల్​లో అట్టహాసంగా చేసుకున్నారు. నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం బలంగా ఉండడం తనకు కలిసివస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో గురువారం చౌటుప్పల్​లో మీడియా సమావేశాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ ​వెళ్లారు. కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కర్నె  ప్రభాకర్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రభాకర్ భార్య పద్మశాలి వర్గానికి చెందినవారు కావడం ఆయనకు కలిసివస్తుందని చెప్పుకుంటున్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన మునుగోడు జడ్పీటీసీ భర్త రవి కూడా రేసులో ఉన్నారు. 

తెరపైకి పలువురు లీడర్లు
రాజగోపాల్ రెడ్డికి దీటైన అభ్యర్థిని నిలబెట్టాలని.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇస్తే ఇబ్బందులు తప్పవని, కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపాలని టీఆర్ఎస్​ లోకల్ కేడర్ ​భావిస్తోంది. మంత్రి జగదీశ్​రెడ్డితో ఇటీవల జరిగిన మీటింగ్​లో దీనిపై చర్చించారు. టికెట్ రేసులో ఉన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి టీడీపీలో ఉన్నప్పటి నుంచి మునుగోడు ప్రజలతో సంబంధాలున్నాయి. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కృష్ణారెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.