
- ఎమ్మెల్సీ ఎంపికలపై టీఆర్ఎస్ లో నిరసనలు
- ఉద్యమాన్ని గేలీ చేసినోళ్లు కూడా ఎమ్మెల్సీలైన్రు
- అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ సీనియర్లు
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల్లో సగం మందికి పైగా వేరే పార్టీల నుంచి వచ్చి చేరినోళ్లే ఉన్నరు. పెద్దల సభకు ఇట్ల బయటనుంచి వచ్చినోళ్లకే ప్రయారిటీ ఇస్తుండటంపై టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘‘రాష్ట్రం వచ్చిన నాటినుంచీ మా నాయకత్వం తీరు ఇట్లనే ఉన్నది. లేటెస్టుగా ముగిసిన ఎమ్మెల్సీ ఎలక్షన్లల్ల కూడా ఇదే రిపీటైంది. మొదట్నుంచీ పని చేస్తున్న మా అసొంటోళ్లకు ఎప్పుడూ మొండిచెయ్యే చూపిస్తున్నరు” అని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ పరిణామాల పట్ల పార్టీ కింది స్థాయి కేడర్లోనూ అసంతృప్తి కనిపిస్తున్నది. శాసనమండలిలో 40 సభ్యులున్నారు. 6 నామినే టెడ్, 3 టీచర్ స్థానాలు పోగా 31 సీట్లలో ఒక కాంగ్రెస్, ఇద్దరు మజ్లిస్ మెంబర్లున్నారు. మిగతా 28 మందీ టీఆర్‌ఎస్ సభ్యులే. వీరిలో ఏకంగా 15మంది, అంటే సగానికి సగం ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లే. వీరిలో ఎక్కువ మంది టీడీపీ నుంచి వచ్చినోళ్లే. వీరిలో కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, భాను ప్రసాద్‌రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులకు రెండోసారి కూడా ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చారు. హుజూరాబాద్ బై పోల్‌కు ముందు కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చారు. ‘‘వీళ్లల్ల చాలామంది ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నే తీవ్రంగా వ్యతిరేకించిన బాపతు. అసోంటోళ్లను పార్టీలోకి తీసుకునుడే గాక ఎమ్మెల్సీలను చేసి అందలమెక్కించిన్రు’ అంటూ టీఆర్ఎస్ సీనియర్ ఒకరు వాపోయారు.
లీడర్లు, ఉద్యమకారుల్లో అసంతృప్తి..
టీఆర్‌ఎస్ పుట్టిన నాటి నుంచీ మంచి చెడు సమయాలన్నింట్లోనూ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చిన సీనియర్లను కాదని అధికారం వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నారని లోలోపల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘మా అసొంటి పాతకాపులకు పదవి ఇస్తమని ప్రతిసారీ ఆశపెట్టుడు. మేం నమ్ముడు. ప్రతిసారీ మాకు హ్యాండిచ్చుడు. ఇదే రిపీటైతున్నది. మేమే కాదు, కింది స్థాయి క్యాడర్ కూడా మా నాయకత్వం మీద చాలా అసంతృప్తితోని ఉన్నది” అని టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ లాంటివాళ్లకు న్యాయం జరగలేదన్నదే పార్టీలో సర్వత్రా ఉన్న అభిప్రాయమని ఆయన అన్నారు. దీనిపై పార్టీ లీడర్లు పలువురు సోషల్ మీడియా వేదికగా బాహాటంగానే నిరసనను తెలుపుతున్నారు కూడా.
ఎమ్మెల్సీలైన ఇతర పార్టీల లీడర్లు వీళ్లే..
భాను ప్రసాద్, కోటిరెడ్డి, తాతా మధు, ఎల్.రమణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, గంగాధర్, సత్యవతి రాథోడ్, బండ ప్రకాశ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం.