టీఆర్​ఎస్​ లీడర్ల భూముల కోసం నేషనల్​ హైవేనే మలిపిన్రు

టీఆర్​ఎస్​ లీడర్ల భూముల కోసం నేషనల్​ హైవేనే మలిపిన్రు

9 కిలోమీటర్ల రోడ్డును 28 కిలోమీటర్లకు పొడిగించిన్రు
 మంత్రి భూములు కాపాడేందుకు మారిన అలైన్​మెంట్​

పాలమూరు జిల్లాలో రెండు నేషనల్​హైవేలను కలిపేందుకు చేపట్టిన ‘భారత్​మాల’ లింకు రోడ్డును టీఆర్​ఎస్ లీడర్లు మలుపులు తిప్పుతున్నారు.  ఫస్ట్​ అలైన్​మెంట్​ సర్వే ప్రకారం 9 కిలోమీటర్లుగా ఉన్న రోడ్డు.. మంత్రి భార్య పేరిట ఉన్న భూమి మీదుగా పోతుండడంతో అలైన్​మెంట్​ మార్చి 28 కిలోమీటర్లకు పొడిగించారు. దీంతో ఇప్పుడా రోడ్డు ఏకంగా పాలమూరు కొత్త కలెక్టరేట్​ కాంపౌండ్​లోంచే పోతోంది. అంతేకాదు పెద్దసంఖ్యలో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయి సుమారు వెయ్యి కుటుంబాలు  రోడ్డున పడనున్నాయి.
 మహబూబ్​నగర్, వెలుగు:  పాలమూరు జిల్లాలో రెండు నేషనల్​హైవేలను కలిపేందుకు ‘భారత్​మాల’ కింద చేపట్టిన లింకు రోడ్డు నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేస్తే సరిపోయేదానికి టీఆర్ఎస్​ లీడర్ల భూముల డిమాండ్​ పెంచుకునేందుకు వేరే పాయింట్​కు మార్చి, 28 కిలోమీటర్లు పెంచిన్రు. తీరా ఈ 28 కిలోమీటర్ల రోడ్డులో ఫస్ట్​ అలైన్​మెంట్​సర్వే ప్రకారం మంత్రి భార్య పేరిట ఉన్న భూమి పోతుండడంతో వెంటనే చక్రం తిప్పిన్రు. ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి మరోసారి అలైన్​మెంట్​ మార్చడంతో ఇప్పుడా రోడ్డు ఏకంగా పాలమూరు కొత్త కలెక్టరేట్​కాంపౌండ్​లోంచే పోతోంది. అంతేకాదు పెద్దసంఖ్యలో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయి సుమారు వెయ్యి కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. 
19 కిలోమీటర్లు పెంచిన్రు.. 
హైదరాబాద్​– బెంగళూరు 44 వ నంబర్​ జాతీయ రహదారి మహబూబ్​నగర్​ జిల్లా మీదుగా పోతోంది. నల్గొండ జిల్లా కోదాడ నుంచి మహబూబ్​నగర్​జిల్లా జడ్చర్ల, పాలమూరు మీదుగా నారాయణపేట జిల్లా మాగనూరు వరకు ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం ఎన్​హెచ్​167గా ప్రకటించింది. ప్రస్తుతం ఈ 44, 167 జాతీయ రహదారులను కలిపేందుకు ‘భారత్​మాల పరియోజన స్కీం’ కింద  కేంద్రం నోటిఫికేషన్​ విడుదల చేసింది. నేషనల్​హైవే అథారిటీ ఆఫీసర్లు భారత్​మాల సర్వే కోసం కన్సల్టెంట్​ఏజెన్సీని పెట్టుకున్నారు. 44వ జాతీయ రహదారి పై గల భూత్పూర్​నుంచి తాటికొండ శివారు, గాజులపల్లి, జమిస్తాపూర్​నుంచి నేరుగా ధర్మాపూర్​వద్ద 167 నేషనల్​హైవేను కలపాలని నిర్ణయించి, సర్వే కు డిసైడ్​ అయ్యారు. ఈ గ్రామాల మీదుగానైతే 8 నుంచి 9 కిలోమీటర్ల లింకు రోడ్డు కొత్తగా వేస్తే సరిపోయేది. ఎక్కువ భాగం సర్కార్​భూములే ఇందులో పోతాయి. చాలా తక్కువ మొత్తంలో రైతులు భూములు కోల్పోతారు. శివారు నుంచి వెళ్తుండటంతో గ్రామాలపై కూడా ఎలాంటి ఎఫెక్ట్​ ఉండదు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. కొందరు టీఆర్ఎస్​ లీడర్ల భూములకు డిమాండ్​కోసం 9 కిలోమీటర్ల రోడ్డును కాదని ఎన్​హెచ్​44పైగల అంబట్ పల్లి గ్రామం నుంచి రోడ్డును డైవర్ట్​చేసి సిద్దాయిపల్లి, అమిస్తాపూర్, పాలకొండ, క్రిష్టియన్​పల్లి, అల్లీపూర్, ధర్మాపూర్​ మీదుగా 28 కిలోమీటర్లకు ప్లాన్​ చేశారు. ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి సర్వే చేయించారు. దీనివల్ల చాలామంది పేద రైతుల భూములు పోతున్నాయి. ఆయా గ్రామాల్లో పెద్దసంఖ్యలో ఇండ్లతో పాటు వందల ఎకరాల భూములు పోనున్నాయి. సుమారు వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్తాయనే అంచనాలు ఉన్నాయి. 
పోతున్న కొత్త కలెక్టరేట్ ​భూమి
లింకు రోడ్డు ఫస్ట్​అలైన్​మెంట్ ప్రకారం పాలమూరులో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ భార్య శారద పేరు మీద సర్వే నం. 258లో ఎకరన్నర పొలంలోని కొంత భాగం పోతోంది. రోడ్డు అవతల ఆయనకు ఫాంహౌస్​కూడా ఉంది. దీంతో ఆఫీసర్లపై ఒత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు. ఫలితంగా నేషనల్​ హైవే, రెవెన్యూ, సర్వే డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు  భారత్​మాల రూట్​మార్చేశారు. తాజా అలైన్​మెంట్​ ప్రకారం  కొత్తగా సర్వే నం. 279లో రూ. 32 కోట్లు పెట్టి అన్ని హంగులతో నిర్మిస్తున్న కలెక్టరేట్​ఆవరణలోంచి లింకురోడ్డును మళ్లించేశారు. దీనిపై అధికారులు ఫైనల్​ సర్వే కూడా పూర్తి చేసి అనుమతులు తెచ్చుకున్నారు. ఈ రోడ్డు కంప్లీట్​అయితే కలెక్టరేట్​ భూమి మూడెకరాలు పోతుంది. కలెక్టరేట్​ బిల్డింగ్​కి రహదారి మధ్య 10 మీటర్లే మిగుల్తుంది. అన్ని జిల్లాల్లో విశాలమైన కలెక్టరేట్లు నిర్మించి.. ఇంటర్నల్​ రోడ్లు, హెలిప్యాడ్​లు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. కానీ కొత్త రోడ్డు కారణంగా పాలమూరు కలెక్టరేట్​పూర్తిగా కళ తప్పనుంది. వాహనాల రద్దీతో కలెక్టరేట్​లో ప్రశాంతత గురించి మరచిపోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
రూ. వంద కోట్ల బైపాస్​ రోడ్డు వృథాయేనా..
మహబూబ్​నగర్​జిల్లా కేంద్రంమీదుగా వెళ్లే 167  హైవే నుంచి భారీ వెహికల్స్​టౌన్​లో కి రాకుండా ఇటీవలే రూ. 100 కోట్లతో ఎస్వీఎస్​హాస్పిటల్​నుంచి క్రిస్టియన్​పల్లి వరకు బైపాస్​రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డును భూత్పూర్,​ మహబూబ్​నగర్​రోడ్డుకు అనుసంధానించారు. భవిష్యత్తులో ఈ బైపాస్​ను క్రిస్టియన్​పల్లి, బండమీదపల్లి, పాలమూరు యూనివర్సిటీ వెనక నుంచి ధర్మాపూర్​ వరకు కలపాలని నిర్ణయించారు. ఈ రోడ్డును కలిపినా 9 కిలోమీటర్లతో రెండు హైవేలు లింక్​ అయ్యేవి. ఈ ఫైలు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వద్ద ​పెండింగ్​లో ఉండగానే దీనికి సమాంతరంగా భారత్​మాలను తీసుకోపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
అలైన్​మెంట్​ మార్చాలని గడ్కరికి లెటర్​ రాశా
భారత్​మాల ఫస్ట్​సర్వే కాదని.. ఇంకో సర్వే.. ఆ సర్వేలో తమ భూములు పోతున్నాయని మరో సర్వే.. ఇలా చేస్తూ పోయారు. చివరాఖరుకు కలెక్టరేట్​పోయేలాగా సర్వే చేశారు. ఇది ఎవరి ప్రయోజనం కోసం చేశారో అందరికీ అర్థం అవుతోంది. వెంటనే ఈ అలైన్​మెంట్​మార్చాలని గడ్కరీకి లెటర్​రాశా. ఢిల్లీకి పోయి కలుస్తా. అందరి జాతకాలు బయటపెడ్తా.                      - ఏపీ. జితేందర్​రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ నేత, మహబూబ్​నగర్​

మంత్రి భార్య జాగా పోకుండా ఉండేందుకే..
పాలమూరును అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొనే మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తన భార్య పేరు మీద ఉన్న జాగా పోతున్నందుకే భారత్​మాలను కలెక్టరేట్​లోకి మార్చిండు. దీని పక్కనే ఉన్న తన ఫాం హౌస్​కు డిమాండ్​ రావాలనే కలెక్టరేట్​ను అక్కడ కట్టించిండు. ఇప్పుడు భార్య పేరు మీద జాగా కోసం భారత్​మాల పక్కనే పోయేలాగా దీన్ని రీ సర్వే చేయించిడు. దీనిపై విచారణ జరగాలే. మార్చిన అలైన్​మెంట్​వల్ల వెయ్యి మంది నిర్వాసితులు అవుతారు. ఇప్పటికే ఇద్దరు గుండె పలిగి చనిపోయిండ్రు.- వెంకటేశ్, టీపీసీసీ కార్యదర్శి, మహబూబ్​నగర్​ 

అసత్య ప్రచారం మానుకోవాలె
రోడ్డు వేయాలంటే భూమి మీదే పోవాలే. ప్రాజెక్టు కట్టాలన్నా భూమే కావాలి. ఆ రోజు ఒకటికి నాలిగింతలు ఎక్కువిచ్చి భూమిని కొన్నాం. ఈ రోజు ధర లక్షలు పలుకుతోంది. అయితే భారత్​మాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదు. అలైన్​మెంట్​మార్చే విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలి. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. రూట్​మార్చేందుకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడ్తా.  - పాల్​కొండ పల్లెప్రగతిలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​