రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం

రెడ్డి కులానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పలువురు నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కేసీఆర్ సర్కారుపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి సడెన్ గా కులాల ప్రస్తావన తీసుకురావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అధికారం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ వెలమ రాజకీయాలను తెరపైకి వస్తున్నాయి. తాజాగా రెడ్డి కులం గొప్పతనం గురించి చెప్పుకొచ్చిన రేవంత్... ఉమ్మడి రాష్ట్రంలో 10 మంది ముఖ్యమంత్రులు రెడ్డి కులస్థులేనన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి రెడ్డికి 10ఎకరాలు ఉన్నప్పుడే రాజ్యం, రాజకీయం రెడ్ల చేతుల్లో ఉంటుందని చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుని పేదలకు సాయం చేసి రెడ్ల గౌరవాన్ని పెంచుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. రెడ్లను నమ్ముకున్న వాళ్లు ఎవరూ మోసపోలేదని.. పార్టీలు గెలవాలంటే రెడ్లకే పార్టీల పగ్గాలు అప్పజెప్పాలని అన్నారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టి వెలమలైన పద్మనాయకులను దగ్గరికి తీశాడని అందుకే కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు. 

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. కులం పేరు చెప్పుకుని కొందరు రాజ్యాన్ని ఏలాలని భావిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేస్తేనే విజయం వరిస్తుందని, కులాలు, మతాలతో గెలిచిన చరిత్ర ఇప్పటి వరకు లేదని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం తగదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. మరోవైపు రేవంత్ రెడ్డి తన వ్యా్ఖ్యలతో జయశంకర్ ను అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

For more news..

తాగునీటి సంక్షోభంపై బీజేపీ ఆందోళన

నయా ట్రెండ్: పాత టైటిల్స్ తో కొత్త స్టోరీస్