హుజురాబాద్​లో ఓట్ల కోసం  సింగరేణిలో గాలం

హుజురాబాద్​లో ఓట్ల కోసం  సింగరేణిలో గాలం

మందమర్రి, వెలుగు: హుజూరాబాద్​ బైపోల్​లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్​ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రామగుండం, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరిట మీటింగ్​లు నిర్వహిస్తోంది. హుజూరాబాద్​ నియోజకవర్గంలో ఎలక్షన్లు ఉంటే ఇక్కడ మీటింగ్​లు పెట్టడమేంటని అనుకుంటున్నారా.. సింగరేణి కార్మికులను ఆకట్టుకునేందుకే ఈ ప్రయత్నమంతా. సింగరేణిలో హుజూరాబాద్​కు చెందినవారు పది వేలకు పైగా ఉన్నారు. దీంతో వారి ద్వారా హుజూరాబాద్​లోని కుటుంబీకులు, బంధువుల ఓట్లను సాధించాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. టీఆర్ఎస్​ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్  సింగరేణి గుర్తింపు సంఘంగా  కొనసాగుతోంది. యూనియన్​ ద్వారా  సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల మద్దతు కోసం కోల్​బెల్ట్​ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడలేని ప్రేమను ఒలకపోస్తున్నారు.   సుదీర్ఘకాలంగా సింగరేణి కార్మికులు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని కొంతమంది కోల్​బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు ఇప్పుడు హుజూరాబాద్​లో టీఆర్ఎస్​అభ్యర్థిని గెలిపించేందుకు కార్మిక కుటుంబాల మద్దతు కోసం తంటాలు పడుతున్నారు. హుజూరాబాద్​అసెంబ్లీ పరిధిలోని గ్రామాలు, పట్టణాల నుంచి ఉద్యోగరీత్యా సింగరేణి ప్రాంతాల్లో  స్థిరపడిన కార్మిక కుటుంబాల సాయంతో అక్కడి ఓటర్లను తమవైపు మరల్చుకొనే పనిలో పడ్డారు.   

కనిపించని కార్మిక నేతలు

ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రజాప్రతినిధుల కన్నా కార్మిక సంఘాల నేతల మాటలకే సింగరేణి కార్మికులు విలువిస్తారు. గతనెల 29న మందమర్రి ఏరియా, రామగుండం1 ఏరియాలో నిర్వహించిన టీఆర్ఎస్​ ఆత్మీయ సమ్మేళనాల్లో టీబీజీకేఎస్​ యూనియన్​ పెద్ద లీడర్లు హాజరు కాలేదు. వెంకట్రావు, రాజిరెడ్డి వంటి పెద్ద లీడర్లు లేకుండానే ఎమ్మెల్యేలు మీటింగ్​లు నిర్వహించగా.. ఇక్కడ కూడా రాజకీయ జోక్యం చేస్తున్నారంటూ మెజార్టీ కార్మికులు దూరంగా ఉన్నారు. కార్మిక నేతలు చెబితేనే వస్తామంటున్నారు. మందమర్రి ఏరియాలో నిర్వహించిన మీటింగ్​లో శ్రీరాంపూర్​ ఏరియాకు చెందిన ఒక వర్గం లీడర్లు మాత్రమే హాజరయ్యారు. తాజాగా కెంగర్ల మల్లయ్య తిరిగి టీబీజీకేఎస్​లోకి రావడంతో టీఆర్ఎస్​ పెద్దలు ఆయన సహకారంతో సింగరేణి కార్మికులతో  హుజూరాబాద్​లో ప్రచారం చేయించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు.  

మీటింగులతో  ప్రేమను కురిపిస్తూ..

హుజూరాబాద్​ నియోజకవర్గంలోని హుజూరాబాద్​, జమ్మికుంట, వీణవంక, నర్సింగపూర్, రెడ్డిపల్లి, చల్లూర్,  బిజిగిరి షరీఫ్, కమలాపూర్, వావిలాల, మామిడాలపల్లి, హిమ్మత్​నగర్, ఇల్లంతకుంట, రామన్నపల్లి తదితర ప్రాంతాలకు చెందినవారి కుటుంబసభ్యులు సింగరేణిలో ఉద్యోగులుగా ఉన్నారు.  వీరికి సొంతూర్లలో భూములు, వ్యవసాయం, స్థిర నివాసాలున్నాయి. ఉద్యోగుల కుటుంబాలు సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కాసిపేట, గోదావరిఖని, సెంటినరీ కాలనీ, యైటింక్లైయిన్ ​కాలనీ, రామగుండం తదితర ప్రాంతాల్లో ఉంటున్నాయి. హుజూరాబాద్​ ఓటర్లకు, సింగరేణి కార్మిక కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వాలను గుర్తించే పనిలో కోల్​బెల్ట్ ​ఎమ్మెల్యేలు పడ్డారు. ఇప్పటికే చెన్నూరు, రామగుండం ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరిట గత నెల 29న మీటింగ్​లు నిర్వహించారు. ఇన్నాళ్లు సింగరేణి సమస్యలపై స్పందించని ఎమ్మెల్యేలు, గుర్తింపు సంఘం లీడర్లు ఇప్పుడు ‘మీకు మేమున్నం.. ఏది కావాల్నంటే అది చేస్తాం.. మీరు జర హుజూరాబాద్​లోని ఓటర్లతో ఓట్లు వేయించాలి’ అని అంటున్నారు. మీరంతా  నెల రోజులు ప్రచారం చేయాలని, అన్నీ మేమే చూసుకుంటామని చెబుతున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబాలకు మరింత చేరువగా ఉంటున్నారు. వరుస భేటీలతో దగ్గరవుతున్నారు. ఇతర యూనియన్లు సైతం తమ మాతృ పార్టీలతో కలిసి సింగరేణిలో  సమ్మేళనాలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.