అంతిమ యాత్ర చుట్టూ రాజకీయం

అంతిమ యాత్ర చుట్టూ రాజకీయం
  • రాకేశ్​ డెడ్​బాడీని తీసుకెళ్తున్న వాహనానికి టీఆర్ఎస్ జెండాలు 
  • మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు
  • ప్రతిపక్ష నేతలు హాజరు కాకుండా అరెస్టులు

వరంగల్‍, వెలుగు: సికింద్రాబాద్ ఘటనలో చనిపోయిన రాకేశ్ అంతిమ యాత్రను టీఆర్ఎస్ నేతలు దగ్గరుండి నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీల నేతలెవరూ పాల్గొనకుండా అడ్డుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సికింద్రాబాద్ ఘటనను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే రాకేశ్ అంతిమ యాత్రను రాజకీయం చేసిందని విమర్శిస్తున్నాయి. అంతిమ యాత్రను పార్టీ కార్యక్రమంలా మార్చిందని మండిపడుతున్నాయి. రాజకీయంగా మైలేజీ పొందేందుకే ఇదంతా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్​లోని ఎంజీఎం నుంచి రాకేశ్ సొంతూరు ఖానాపూర్‍ మండలంలోని దబ్బీర్‍ పేట వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర టీఆర్ఎస్ లీడర్లు యాత్ర నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఎంజీఎంకు చేరుకొని రాకేశ్ కు నివాళులర్పించిన నేతలు.. అతని డెడ్ బాడీని వాహనంలోకి ఎక్కించారు. యాత్ర వాహనాన్ని పార్టీ జెండాలతో నింపేశారు. పైగా ప్రతిపక్ష నేతలెవరూ యాత్రలో పాల్గొనకుండా పోలీసులతో అరెస్టులు చేయించారు. యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కాగా, ఎంజీఎంలో రాకేశ్ కు నివాళి అర్పించి వెళ్లిపోయిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్... తిరిగి మళ్లీ అంత్యక్రియల సమయానికి దబ్బీర్‍పేటకు చేరుకున్నారు. అక్కడ రాకేశ్ పాడే మోశారు. 

డబ్బులిచ్చి జనాలను తీసుకొచ్చిన్రు... 
అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో జనాన్ని తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ లీడర్లు డబ్బులు పంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, వృద్ధులకు డబ్బులిచ్చి తీసుకొచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయ సభకు తరలించినట్లు డబ్బులిచ్చి జనాన్ని తీసుకొచ్చారని, వారికి టీఆర్ఎస్ కండువాలు కప్పి యాత్రలో నడిపించారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, ఓ ఎమ్మెల్యే, ఓ కార్పొరేటర్‍ రూ.300 ఇస్తామని చెబితే వచ్చామని యాత్రలో పాల్గొన్న కొందరు మహిళలు చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

టీఆర్ఎస్ జెండాలు తీసెయ్యాలని ఆందోళన..
అంతిమ యాత్ర వాహనాన్ని టీఆర్ఎస్​ జెండాలతో నింపేయడంపై రాకేశ్ బంధువులు, స్నేహితులు మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సిన రాకేశ్ అంతిమ యాత్రను టీఆర్ఎస్ కార్యక్రమంగా మార్చారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ జెండాలు తీసెయ్యాలని నర్సంపేటలో కొద్దిసేపు ఆందోళన చేశారు.