గొర్రెల స్కీం పెద్ద ఫ్రాడ్

గొర్రెల స్కీం పెద్ద ఫ్రాడ్

మంచిర్యాల, వెలుగు: గొల్ల కురుమల బాగు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీంలో భారీగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని.. ఇదో పెద్ద ఫ్రాడ్ స్కీంగా మారిందని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ మెంబర్లు మండిపడ్డారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్‌‌లో సంబంధిత ఆఫీసర్‌‌‌‌ను నిలదీశారు. దీనిపై ఎంక్వైరీ చేసి బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌ను డిమాండ్ చేశారు. ముందుగా జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘సెకండ్ ఫేజ్‌‌లో జిల్లాలో 612 యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. ఒక్కో యూనిట్‌‌లో 21 గొర్రెలు ఇవ్వాలి. కానీ 15, 16కు మించి ఇవ్వలేదు. ఇచ్చినవి కూడా చిన్నవి, బక్క చిక్కినవే ఉన్నాయి. కొన్ని ట్రాన్స్​పోర్టు చేస్తుండగానే చనిపోయాయి. గొర్రెల చెవులకు వేసిన ట్యాగ్‌‌లు మార్చుతూ నాలుగైదు సార్లు రీసైక్లింగ్ చేశారు” అని ఆరోపించారు. 15 గొర్రెలు ఇచ్చి 21 గొర్రెలకు ఇన్సూరెన్స్ చేశారని, వీటన్నింటికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలు తనవద్ద ఉన్నాయని చెప్పారు. రెండు విడతల్లో పంపిణీ చేసిన వాటిలో 10 శాతం కూడా లేవని, ఉంటే చూపించాలని జిల్లా పశువైద్య అధికారి శంకర్‌‌‌‌ను నిలదీశారు.

అక్రమాలు ఆఫీసర్లకు తెలుసు..దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. గొర్రెల స్కీంలో ఫ్రాడ్ జరుగుతోందని చెప్పారు. అక్రమాల గురించి కలెక్టర్‌‌‌‌కు తెలియకున్నా ఆఫీసర్లకు తెలుసని అన్నారు. సంబంధిత ఆఫీసర్లు, ఏజెన్సీల పాత్రపై ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇస్తే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గొర్రెల స్కీంలో అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందిస్తూ.. త్వరలోనే ఎంక్వైరీ చేసి బాధ్యులపై యాక్షన్ తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్ మాట్లాడుతూ.. రైతుల కోసం నిర్మించిన రైతు వేదికల లక్ష్యం నెరవేరడం లేదన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు.