- షురూ జేసిన టీఆర్ఎస్.. డౌట్ ఉన్న ప్రాంతాలపై ఫోకస్
- క్యాండిడేట్లను తరలించిన రామగుండం ఎమ్మెల్యే
- అదే పనిలో మరికొందరు ఎమ్మెల్యేలు
- గెలిచే రెబల్స్, ఇండిపెండెంట్లకు గాలం
- కొందరు ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్లు..
- వ్యూహంపై ఎప్పటికప్పుడు డైరెక్షన్!
హైదరాబాద్, వెలుగు:
మున్సిపోల్స్ రిజల్ట్స్ రాకముందే క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. కొన్నిప్రాంతాల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్లను ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలించడం మొదలుపెట్టారు. సొంతంగా పార్టీకి మెజార్టీ రాని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గుర్తించి, వాటిపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆయా ప్రాంతాల్లోనూ చైర్పర్సన్, మేయర్ పీఠాలను సొంతం చేసుకునేందుకు వ్యూహం అమలు చేస్తోంది. పార్టీకి డౌట్‌గా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అక్కడి ఎమ్మెల్యేలకు, నేతలకు గులాబీ పెద్దలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. క్యాండిడేట్లను క్యాంపులకు తరలించాలని, గెలిచే అవకాశం ఉన్న రెబల్స్‌ను, ఇండిపెండెంట్లను మచ్చిక చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం.
‘‘వెంటనే క్యాంపులు పెట్టండి. అవసరమైన చోట రెబల్స్ ను, ఇతర పార్టీల వారిని తీసుకోండి. చైర్పర్సన్, మేయర్ పదవి అవతల పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కొద్దు’’ అని దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. కొందరు ఎమ్మెల్యేలకు, లీడర్లకు ఫోన్లు చేసినట్లు తెలిసింది.
గెలుపోటములపై అంచనాకు వచ్చి
రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు, 9 కార్పొరేషన్లకు శనివారం ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 27 చైర్పర్సన్, మేయర్ ఎన్నిక ఉంటుంది. అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా పోలింగ్ ముగిసిన వెంటనే గెలుపోటములపై టీఆర్ఎస్ ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలిసింది. పార్టీకి డౌట్‌గా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. ఆయా చోట్ల గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను, ఇతర పార్టీల క్యాండిడేట్లను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్, చైర్పర్సన్ పదవులు దక్కించుకోడానికి కావాల్సిన సంఖ్యా బలం రావని భావిస్తున్న చోట క్యాంపులు పెట్టాలని ఎమ్మెల్యేలకు, లీడర్లకు టీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఫోన్లలో కేసీఆర్ డైరెక్షన్!
కొన్ని అనుకూలంగా లేని మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలకు గురువారం ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి.. అనుసరించాల్సిన వ్యూహంపై డైరెక్షన్ ఇచ్చినట్టు తెలిసింది. ఆసిఫాబాద్, ఆలేరు, రామగుండం, నిజామాబాద్ ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడినట్లు సమాచారం. మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ పదవుల కోసం ఏం చేయాలో వారికి వివరించినట్టు తెలిసింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ క్యాండిడేట్లను క్యాంపునకు తరలించారు. ఖానాపూర్, యాదగిరిగుట్టకు చెందిన వారిని కూడా స్థానిక ఎమ్మెల్యేలు క్యాంపులకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే క్యాండిడేట్లను ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఖానాపూర్, యాదగిరిగుట్ట, మంథని, మధిర, నందికొండ, హాలియా, చండూరు మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ నెంబర్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులకు సీఎం వివరించినట్లు ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. సీఎం కేసీఆర్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు ఫోన్ చేసి.. వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని, ఒకవేళ తక్కువ సీట్లను గెలిస్తే ఏం చేయాలో డైరెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఎంపికపై కూడా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో సీఎం మాట్లాడినట్లు తెలిసింది.
ఉమ్మడి నల్గొండలో పరిస్థితిపై ఆరా
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4 మున్సిపాలిటీలు చండూరు, యాదగిరిగుట్ట, హాలియా, నందికొండలో పరిస్థితిపై సీఎం ఆరా తీస్తున్నారు. చైర్పర్సన్ పదవులు దక్కించుకునేందుకు ఏం చేయాలో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులకు ఫోన్లో వివరించినట్లు తెలిసింది. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఆయన ఫోన్ చేసి.. రెబల్స్ విషయంలో ఏం చేయాలన్నది సూచించినట్లు సమాచారం.
కాంగ్రెస్ పట్టున్న ప్రాంతాలపై దృష్టి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గ పరిధిలోని మధిర, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని చండూరు, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసెంబ్లీ సెగ్మెంట్లోని మంథని, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నియోజకవర్గం నాగార్జునసాగర్ పరిధిలోని హాలియా, నందికొండలో కాంగ్రెస్ బలంగా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అక్కడ చైర్పర్సన్ పదవులు దక్కించుకోవాలనుకుంటున్నాయి. అక్కడి నేతలకూ సీఎం ఫోన్లు చేసి పరిస్థితిపై చర్చించినట్లు తెలిసింది. పదవులు టీఆర్ఎస్కు వచ్చేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇందూరులో మజ్లిస్ సహకారం!
నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై సీఎం దృష్టి పెట్టారు. ఇక్కడ మెజార్టీ కోసం అవసరమైతే మజ్లిస్ సహకారం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే మజ్లిస్ కూడా మేయర్ పదవి అడిగితే ఏం చేయాలనే దానిపై కూడా జిల్లా నాయకులతో సీఎం చర్చించినట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది.
కేసీఆర్‌కు తప్పని రెబల్స్ బెడద
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో రెబల్స్ కీలకంగా మారొచ్చని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తూప్రాన్‌లో రెబల్స్ ను బుజ్జగించి చైర్పర్సన్ ఎన్నిక సాఫీగా జరిపించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.
ఫలితాల రోజు కేటీఆర్ భేటీ
దావోస్ పర్యటనలో ఉన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. అదే రోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల కానుండడంతో తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమాలోచనలు జరుపనున్నారు. శనివారం ఉదయం 10 గంటల వరకు తెలంగాణ భవన్‌కు రావాలని ఇప్పటికే ఎమ్మెల్సీలు, మున్సిపోల్స్ ఇన్చార్జులకు పిలుపు అందింది. మేయర్, చైర్పర్సన్ల ఎంపికపై ఏం చేయాలనే దానిపై కేటీఆర్ సలహాలు, సూచనలు చేస్తారు. పూర్తి మెజార్టీ రాని చోట్ల ఎలాంటి వ్యూహం అనుసరించాలో వివరించనున్నారు.
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల టీఆర్‌ఎస్ క్యాండిడేట్లు హైదరాబాద్‌కు
మంచిర్యాల, గోదావరిఖని, ధర్మపురి, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు షురూ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ క్యాండిడేట్లను క్యాంప్‌లకు తరలించింది. వీరంతా ఈ నెల 27న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు క్యాంపుల నుంచి డైరెక్ట్‌గా హాజరయ్యేలా ప్లాన్ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట, రామగుండం, ధర్మపురి మున్సిపాలిటీలకు చెందిన అభ్యర్థులంతా గురువారం సాయంత్రం బస్సుల్లో తరలివెళ్లారు. చెన్నూర్, క్యాతన్‌పల్లిలో మెజార్టీ ఖాయమనే ధీమాతో ఉన్నారు. దీంతో ఈ రెండు మున్సిపాలిటీల అభ్యర్థులను క్యాంప్‌లకు తరలించలేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తండ్రి బుధవారం చనిపోవడంతో వారు కూడా గురువారం వెళ్లలేదు. వీరిని శుక్రవారం క్యాంప్‌లకు తరలించనున్నారు. రామగుండం నుంచి పార్టీ క్యాండిడేట్లను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో వెళ్లారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్ అధిష్ఠానం కౌన్సిలర్లు చేజారిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. క్యాంప్‌ల బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. వాళ్లు ఒక్కో గ్రూప్‌కు ఒక్కో ఇన్‌చార్జ్‌ను నియమించి క్యాంప్‌లకు పంపిస్తున్నారు. మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ ఆధిపత్యానికి కాంగ్రెస్, బీజేపీలు గండికొట్టే అవకాశాలున్నాయి. దీంతో టీఆర్‌ఎస్ ఇలా జగ్రత్తపడుతోందని సమాచారం. 25న రిజల్ట్స్ తరువాత గెలిచిన క్యాండిడేట్లు 27న ఉదయం డైరెక్ట్‌గా మున్సిపాలిటీలకు హాజరై ప్రమాణస్వీకారం చేస్తారు. తరువాత మధ్యాహ్నం చైర్మన్, వైస్‌చైర్మన్లను ఎన్నుకుంటారు.

దగ్గరుండి బస్సెక్కించిన చందర్
రామగుండం కార్పొరేషన్ టీఆర్ఎస్క్యాండిడేట్లను హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన క్యాంప్‌కు తరలించారు. గురువారం రాత్రి గోదావరిఖనిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దగ్గరుండి వీరిని బస్కెక్కించారు. సగానికిపైగా డివిజన్లు గెలుచుకుంటామన్న ఆయన రిజల్ట్స్ రాకముందే క్యాండిడేట్లను క్యాంప్‌కు తరలించడం గమనార్హం. ఈ నెల 27న మేయర్ ఎన్నిక రోజు నేరుగా కార్పొరేషన్ ఆఫీస్‌కు వచ్చేలా ప్లాన్ చేశారు. రామగుండం కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఎవరికి ఆ పదవి దక్కనుందనేది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నిర్ణయించనున్నట్టు సమాచారం. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి సైతం కాంగ్రెస్, టీఆర్ఎస్అభ్యర్థులు గురువారం రాత్రి క్యాంప్‌లకు తరలారు.
