ఒకే పేరుతో రెండు సీఎంఆర్ఎఫ్ ​చెక్కులు

ఒకే పేరుతో రెండు సీఎంఆర్ఎఫ్ ​చెక్కులు

చొప్పదండి, వెలుగు: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఒకే గ్రామానికి చెందిన ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులకు రూ. 60 వేల విలువ గల చెక్కులు మంజూరు కాగా ఓ చెక్కును టీఆర్ఎస్​లీడర్లు కాజేసి నిధులు స్వాహా చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామానికి చెందిన పెంచాల నారాయణ, అదే గ్రామానికి చెందిన పోచంపల్లి నారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరికీ రూ. 60 వేల చొప్పున రెండు చెక్కులు మంజూరయ్యాయి. చెక్కులు వచ్చిన సమాచారం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్​ లీడర్లు ఇద్దరు లబ్ధిదారులకు చెప్పకుండా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వెళ్లి రెండు చెక్కులను తీసుకున్నారు. చెక్కుపై పి. నారాయణ అని ఉండడంతో పెంచాల నారాయణ అకౌంట్​లో వేశారు.

అనంతరం పెంచాల నారాయణ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయించి అతనికి చెందిన రూ.60 వేలను ఇచ్చేశారు. పోచంపల్లి నారాయణకు చెందిన రూ. 60 వేలు వాడుకున్నారు. పోచంపల్లి నారాయణ బూరుగుపల్లిలోని చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వెళ్లి చెక్కు గురించి అడగగా వెదురుగట్ట గ్రామానికి చెందిన టీఆర్ఎస్​ లీడర్లు​ తీసుకువెళ్లారని చెప్పారు. పోచంపల్లి నారాయణ టీఆర్ఎస్​లీడర్లను నిలదీయగా డబ్బులు ఇస్తామంటూ కాలయాపన చేశారు. విషయం ఆ నోట ఈ నోట బయటకు పొక్కి సోషల్​మీడియాలో వైరలైంది. టీఆర్ఎస్​లీడర్లు పోచంపల్లి నారాయణకు చెందిన రూ.60 వేలు చెల్లిస్తామని అనడంతో వివాదం సద్దుమణిగింది.