147 ఎకరాల అటవీ భూమి కబ్జాకు టీఆర్ఎస్ లీడర్ల యత్నం

 147 ఎకరాల అటవీ భూమి  కబ్జాకు టీఆర్ఎస్ లీడర్ల యత్నం

పెద్దకొత్తపల్లి(నాగర్​కర్నూల్​),వెలుగు: అసలే అధికార పార్టీ నాయకులు..అందులోనూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గీయులు.. ఇంకేముంది పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్‌ దిన్నె గ్రామంలో పోటీ పడి మరీ 147 ఎకరాల సర్కారు, ఫారెస్ట్‌ ల్యాండ్‌ను కబ్జా చేశారు. అంతేకాదు రెవెన్యూ ఆఫీసర్లను మేనేజ్ చేసి దర్జాగా పట్టా కూడా చేయించుకున్నారు. విషయం బయటికి రావడంతో సోమవారం బీజేపీ నేతలు పెద్దకొత్తపల్లి తహసీల్దార్‌‌ ఆఫీస్‌ ముందు ధర్నాకు దిగారు. 

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు భీమేశ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే , మాజీ మంత్రి అనుచరులు ఫారెస్ట్, సర్కారు భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటుంటే రెవెన్యూ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దొంగలతో జతకట్టి  కబ్జాలకు సహకరిస్తే  ఊరుకునేది లేదని, న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా, కబ్జాల బాగోతం బయటికి రావడంతో మండల జడ్పీటీసీ గౌరమ్మ 
తాను పట్టా చేయించుకున్న మూడెకరాలను ప్రభుత్వానికి సరెండర్​ చేస్తానని ప్రకటించారు. అయితే  అంతకంటే  ముందు మిగతా వాళ్లు  సరెండర్​ చేయాలని ఆమె భర్త  కండీషన్​ పెట్టడం గమనార్హం.

ఇదీ జరిగింది.. 

కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం మారెడు​మాన్ ​దిన్నె గ్రామంలోని సర్వేనెంబర్‌‌ 207లో 47 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్,  126,90,91 సర్వే నెంబర్లలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.  దీనిపై కన్నేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు 50 మంది కబ్జా పెట్టారు.  అనంతరం రెవెన్యూ ఆఫీసర్లను మేనేజ్‌ చేసి 2020లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ ల్యాండ్‌ 
పార్ట్​–బిలో నిషేధిత జాబితాలో ఉన్నా రెవెన్యూ ఆఫీసర్లు పట్టాలివ్వడం గమనార్హం.  ప్రస్తుతం ఈ భూములకు రైతు బంధు, పంట రుణాలు కూడా తీసుకుంటున్నారు.    

జడ్పీటీసీ స్టేట్‌మెంట్‌తో..

ఈ ఇష్యూపై గత మూడు రోజులుగా బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుండడంతో ఎమ్మెల్యే బీరం వర్గానికి చెందిన పెద్దకొత్తపల్లి జడ్పీటీసీ గౌరమ్మ తాను మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రమే పట్టా చేయించుకున్నానని వీడియో రిలీజ్‌ చేశారు.  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు అక్రమంగా పట్టాలు చేయించుకునే సమయంలో తాము అడ్డుకున్నామని,  అప్పుడు తమ వర్గం వారికి కూడా పట్టాలు ఇచ్చారని  చెప్పారు. అందులో భాగంగానే తనకు మూడెకరాలు పట్టా అయ్యిందని, తిరిగి దాన్ని ప్రభుత్వానికి ఇస్తానని వెల్లడించారు.  అంతేకాదు కబ్జాల విషయంలో మాజీ మంత్రి జూపల్లి ప్రమేయం లేదా.. అని ప్రశ్నించారు.  

ఎవరినీ వదలం.. 

అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా కబ్జాలు చేస్తుంటే  రెవెన్యూ ఆఫీసర్లు సహకరించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు భీమేశ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర  కార్యదర్శి జలాల్​శివుడు మండిపడ్డారు.  ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ  ఫారెస్ట్‌, ప్రభుత్వ భూములను  తిరిగి స్వాధీనం చేసుకునే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.   ఈ ఘటనపై ఏసీబీతో విచారణ చేయించి, పార్ట్‌–బీలో ఉన్నా  రిజిస్ట్రేషన్ చేసి పట్టాలిచ్చిన ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌‌ రవికుమార్‌‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో  సింగిల్ విండ్​ వైస్​ చైర్మన్​ మెరుగు రాజు, జిల్లా కార్యదర్శి గువ్వల్లి వెంకటయ్య, జిల్లా యువమోర్చా కార్యదర్శి లింగస్వామి, అమ్మ పల్లి మల్లేశ్, శ్రీకాంత్​ పాల్గొన్నారు.