దళితుల భూముల కబ్జా!

దళితుల భూముల కబ్జా!
  • మరో 55 ఎకరాలపైనా కన్ను
  • పేదలకు అప్పటి ప్రధాని ఇందిర ఇచ్చిన భూములవి
  • పక్కనే ఉన్న మిగులు భూములూ కలిపేసుకుంటున్రు
  • పట్టించుకోని ఆఫీసర్లు

సంగారెడ్డి/కంది, వెలుగు: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 38 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన భూములవి. ఆ అసైన్డ్ భూములపై టీఆర్ఎస్ బడా నేతల కన్ను పడింది. ఇంకేముంది రూల్స్ బ్రేక్ చేసి అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి భూ దందాకు తెగబడుతున్రు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం శివారు సర్వే నంబర్ 656లో ఉన్న 245 ఎకరాలలో ఇదివరకే 22 ఎకరాలు చేతులు మారాయి. ఇప్పుడు మరో 55 ఎకరాల క్రయ విక్రయాలపై టీఆర్ఎస్ లీడర్ల మధ్య జరిగిన గొడవతో అసలు విషయం కాస్తా బయటపడింది. గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న ఈ భూముల్లో ఎలాంటి రియల్​ఎస్టేట్​బిజినెస్ చేయొద్దన్న రూల్స్​కూడా ఉన్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలు కొందరు అక్రమార్కులతో చేతులు కలిపి దళిత రైతులకు అన్యాయం చేస్తున్నారు. 

ఎకరా రూ. 5 కోట్లు..
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి 1982లో ఇందిరాగాంధీ పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు. అదే పార్లమెంట్ పరిధిలోకి వచ్చే కంది సమీపంలోని 656 సర్వే నంబర్​లో ఆమె 1983లో స్థానికంగా ఉండే 220 మంది పేద రైతులకు 77 ఎకరాలు పంపిణీ చేశారు. ఇందులో మ్యాగ్జిమం దళిత రైతులే ఉన్నారు. 65వ నేషనల్ ముంబై హైవేకు ఈ భూములు దగ్గర్లో ఉండడంతో ప్రస్తుతం వాటి విలువ ఎకరాకు రూ.5 కోట్లు పలుకుతోంది. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు బడా నేతలు పేదలకు కొంత మొత్తం చెల్లించి 22 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది చాలదన్నట్టు పక్కనే ఉన్న మరికొంత ప్రభుత్వ భూమిని ఇందులో కలుపుకొని చుట్టూ ప్రహరీ కట్టారు. మరోవైపు దాదాపు నాలుగు దశాబ్దాలుగా కబ్జాలో ఉన్న పేద దళిత రైతులకు రెవెన్యూ ఆఫీసర్లు కొత్త పట్టాపాస్ బుక్కులు ఇయ్యకుండా సతాయిస్తున్నారు.

మిగులు భూముల లెక్క తేల్చట్లే..
సర్వే నంబర్ 656లో ఉన్న మిగులు భూములను బినామీల పేరుతో టీఆర్ఎస్ లీడర్లు కొందరు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. దళితులకు అసైన్డ్ చేసిన భూముల పక్కనే ఈ మిగులు భూమి ఉన్నప్పటికీ వాటి లెక్క తేల్చడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ లీడర్ల ఒత్తిడి మేరకు గవర్నమెంట్ భూమికి ఎన్ఓసీ ఇచ్చి బై నంబర్ల ద్వారా బినామీల పేరుతో ఇతరులకు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ క్రయ విక్రయాలపై టీఆర్ఎస్ లీడర్ల మధ్య సయోధ్య బెడిసికొట్టి ఇష్యూ కాస్త బయటకు పొక్కింది. సర్వే నంబర్ 656లోని అసైన్డ్ భూముల వ్యవహారంపై టీఆర్ఎస్ ముఖ్యనేతల జోక్యం గురించి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వేల కోట్ల ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ కావడంతో జిల్లా యంత్రాంగం కూడా ఈ అక్రమ భూ దందాకు సహకరిస్తుందన్న అభియోగాలున్నాయి. అందుకే నేషనల్ హైవేకు సమీపంలో ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి ఇచ్చిన భూములకు టీఆర్ఎస్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కంది పరిధిలోని 656 సర్వే నంబర్ లో జరుగుతున్న భూ అక్రమాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇట్లా బయటపడింది
దళితులకు ఇచ్చిన సర్వే నంబర్ 656లోని 12 ఎకరాలకు సంబంధించిన భూ అమ్మకాల్లో నియోజకవర్గానికి చెందిన ఓ లీడర్, మంత్రి అనుచరుడైన మరో లీడర్ మధ్య బేరసారాలు కుదరలేదు. దీంతో లబ్ధిదారుల భూముల అమ్మకాలపై ఎవరికి వారు బేరాలు తీసుకురావడం మొదలుపెట్టడంతో పోటీ పెరిగి వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్త మంత్రి వద్దకు వెళ్లగా ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్టు తెలిసింది. అయితే టీఆర్ఎస్ అసమ్మతి వర్గానికి చెందిన మరో లీడర్ ఈ ఇష్యూని ఆధారాలతో సహా బయటపెట్టి సొంత పార్టీ నేతలు చేస్తున్న భూ అక్రమాలపై రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.