
టీఆర్‌ఎస్‌లో కొత్త, పాత నేతల మధ్య అగాధం పెరుగుతోంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు రెండుగా చీలడం అధిష్టానవర్గ పెద్దలను కలవరపెడుతోంది. ఇరువర్గాల నేతలు ఎవరికి వారే అన్నట్టుగా పని చేయడం కేడర్‌కు ఇబ్బందికరంగా మారింది. మొన్నటి పరిషత్ ఎన్నికల్లో ఈ వివాదాలు పార్టీని దెబ్బతీశాయని, ఇపుడు మున్సిపల్ఎన్నికలు సమీపించడంతో వర్గపోరు ఇతర పార్టీలకు అనుకూలిస్తుందని ఆందోళన చెందుతున్నారు.
ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీలో రెండు గ్రూపుల పోరు చివరకు రచ్చకెక్కుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య సయోధ్య కుదరటం లేదు. ఏళ్లపాటు పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెడుతున్నారని పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్ర వేసి చివరకు కొందరికి సభ్యత్వ నమోదులో కూడా ప్రాధాన్యం ఇవ్వడంలేదని పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న కొందరు ఆవేదన చెందుతున్నారు. ఈ వర్గపోరు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు లాభించగా రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఆవిర్భావం నుంచి మంచి పట్టు..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మంచి పట్టుంది. తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం వెన్నంటి నిలిచింది. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత వరుస అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు వేగంగా దూసుకెళ్లింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉన్న ఎల్లారెడ్డి సీటు కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది.
టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ప్రస్తుత ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఓడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు ఎల్లారెడ్డి మినహా మిగతా 8చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. పార్టీకి పట్టున్న చోట కాంగ్రెస్ విజయం సాధించటంపై గులాబీ బాస్ కూడా విస్మయానికి గురయ్యారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
పార్లమెంట్ఎన్నికల ముందు టీఆర్ఎస్లోకి..
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సురేందర్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయనతోపాటు కొందరు నాయకులు, కార్యకర్తలు కూడా వెళ్లారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వర్గంగా రెండు వర్గాలయ్యాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు బీ- ఫారాలు ఇచ్చే అధికారాన్ని ఎమ్మెల్యే సురేందర్‌కు అధిష్టానం అప్పజెప్పింది. ఇరువురు కలిసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించింది.
బీ-ఫారాలు సురేందర్ కు ఇవ్వటంపై రవీందర్ రెడ్డి వర్గం విస్మయానికి గురైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. సురేందర్ అధిక స్థానాల్లో తన వర్గీయులకే టికెట్లు ఇవ్వటం రవీందర్ రెడ్డి వర్గీయులకు మింగుడు పడలేదు. పార్టీ పెద్దల జోక్యంతో మొదటి నుంచి జెండా మోసిన వారికి అక్కడక్కడ కొన్ని సీట్లు మాత్రమే వచ్చాయి. టికెట్లు దక్కని వారు రెబ్సల్ గా బరిలో నిలిచి గెలిచారు. నియోజకవర్గంలోని 7 జడ్పీటీసీలకుగాను నాలుగు చోట్ల కాంగ్రెస్‌పార్టీ గెలవగా, 3చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. పలు ఎంపీటీసీ స్థానాలు సైతం టీఆర్ఎస్ కోల్పోయింది. రవీందర్‌రెడ్డి వర్గీయులవల్లే టీఆర్ఎస్ఓటమి చెందాల్సి వచ్చిందని సురేందర్ వర్గానికి చెందిన వారు ఆరోపించారు. ఈ వర్గ పోరు ఇంకా సమసి పోలేదు.
మండలాధ్యక్షుడికి రాని పిలుపు..
ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. సభ్యత్వ నమోదు పుస్తకాలను, బాధ్యతను ఎమ్మెల్యే సురేందర్ కు అధిష్టానం అప్పగించింది. ఆయా మండలాల్లో సభ్యత నమోదు కార్యక్రమానికి పార్టీలో మొదటి నుంచి ఉన్న కొందరిని పిలవలేదని పలువురు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్ర వేసి తమను ఆహ్వానించలేదని అంటున్నారు. లింగంపేట, సదాశివనగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, రామారెడ్డి తదితర మండలాల్లో పలువురిని పిలవలేదని తెలుస్తోంది. లింగంపేట పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లింగమయ్యకు కూడా సమాచారం ఇవ్వకుండా సభ్యత నమోదు ప్రారంభించటంపై వారు విస్మయానికి గురయ్యారు.
దూరం పెడుతున్నారని ఆవేదన..
మాజీ ఎమ్మెల్యేవర్గంగా చెబుతున్న లింగంపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఇటీవల సమావేశమయ్యారు. పార్టీ అవిర్భావం నుంచి జెండా మోసిన తమను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. కొన్ని మండలాల్లో మొదట్లో రవీందర్‌రెడ్డి వెంట తిరిగిన పలువురు నాయకులు ప్రస్తుతం ఎంపీ బీబీపాటిల్వెంట, సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్ వెంట తిరుగుతున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు చోట్లటీఆర్ఎస్ ఓటమి చెందింది. రవీందర్‌రెడ్డి కూడా కొద్ది రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా ఏర్పడటంతో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వర్గ పోరు మున్సిపల్ ఎన్నికల్లో ఏ ప్రభావం చూపుతుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారింది.