రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం చిచ్చు పెడుతోంది : టీఆర్ఎస్ మంత్రులు

రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం చిచ్చు పెడుతోంది : టీఆర్ఎస్ మంత్రులు

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కార్యాలయాల సముదాయం ఏర్పాటు చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనా సముదాయాలు ప్రజల ఉన్నతికి తార్కాణం అని పేర్కొన్నారు. పాలన సంస్కరణలతో ప్రజలకు ప్రభుత్వం పారదర్శకంగా సేవలందిస్తోందని చెప్పారు. యాసంగిలో వీలైనంత వరకు వరి తక్కువగా సాగు చేస్తే మంచిదని రైతులకు చెప్పారు. యాసంగికి రైతుబంధు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోందని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీన పాలమూరులో సీఎం కేసీఆర్ పర్యటన కారణంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. 

రాష్ట్రాల మధ్య కేంద్రం చిచ్చు పెడుతోంది: నిరంజన్ రెడ్డి

దేశంలో తెలంగాణ వేరుశనగకు ఉన్న డిమాండ్ మరెక్కడా లేదని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వేరుశనగ విస్తీర్ణం మరింత పెరగాలని అన్నారు. దేశ, విదేశీ అవసరాలకు అనుగుణంగా పాలమూరులా వేరుశనగ విత్తనోత్పత్తి చేయాలని చెప్పారు. పాలమూరు పంటను కొనలేని దుస్థితిలో  కేంద్ర ప్రభుత్వం ఉందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది జలాల వాటా విషయంలో రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం చిచ్చు పెడుతోందని ఆరోపించారు. రెండు వారాల్లో తేల్చాల్సిన సమస్యను ఎనిమిదేళ్లుగా తాత్సారం చేస్తోందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు పూర్తయినా.. వాటా తేల్చకపోవటం వల్ల నీళ్లు నింపలేకపోతున్నాని చెప్పారు. నీటి పంపిణీ చేయక రాష్ట్రాల మధ్య తగువు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని కేంద్రం చూస్తోందని మండిపడ్దారు.

కావాలనే ఈడీ దాడులు : శ్రీనివాస్ గౌడ్

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా.. కావాలనే ఈడీ దాడులు చేయిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈడీ, ఐటీ దాడులకు తాము భయపడేది లేదని చెప్పారు. ఈడీ దాడుల గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. దాడులకు ప్రతీకారం ఉంటుందని.. ప్రతిదాడులు చేస్తామని చెప్పారు. దేశాన్ని దోపిడీ చేసిన వాళ్లను వదిలేసి.. రాజకీయ కక్షతో తెలంగాణ మంత్రులపై దాడులు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.