దాడి చేస్తున్నారని 100కు ఫోన్ చేస్తే.. పోలీసులు గంట దాకా రాలే

దాడి చేస్తున్నారని 100కు ఫోన్ చేస్తే.. పోలీసులు గంట దాకా రాలే
  • బీజేపీ లీడర్లపై ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుల దాడి
  • కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డ వంద మంది దుండగులు
  • బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సహా ముగ్గురికి గాయాలు
  • ఇన్నోవా ధ్వంసం.. ఫోన్లు పగులగొట్టిన టీఆర్ఎస్ లీడర్లు
  • దాడిని ఖండించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు రెచ్చిపోయారు. మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు వెళ్లిన బీజేపీ నేతలపై పక్కా ప్లాన్ ప్రకారం దాడికి దిగారు. ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. మూడు ఫోన్లు గుంజుకొని పగులగొట్టారు. మరోసారి నియోజకవర్గంలో కనిపిస్తే చంపేస్తామని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ సహా ముగ్గురు గాయపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి.. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పక్కా స్కెచ్‌‌‌‌ ప్రకారం దాడి
శనివారం బీజేపీ లీడర్లు చెన్నూర్, కోటపల్లి మండలాల్లో పర్యటించనున్నారని తెలిసి టీఆర్ఎస్ లీడర్లు దాడికి ప్లాన్ చేశారు. బీజేపీ లీడర్లు కోటపల్లి మండలంలోని చింతలపల్లి ఇసుక క్వారీల దగ్గరికి వస్తారన్న సమాచారంతో బాల్క సుమన్ అనుచరులు అక్కడ కాపు కాశారు. దీన్ని పసిగట్టిన బీజేపీ లీడర్లు చింతలపల్లి వెళ్లకుండా మధ్యాహ్నం 12.30 గంటల టైంలో చెన్నూర్ శివారులోని మిర్చి కల్లాల దగ్గర ఆగారు.

ఈ విషయం తెలుసుకుని చెన్నూర్ మున్సిపల్ చైర్​పర్సన్ భర్త రాంలాల్ గిల్డా, జడ్పీటీసీ మెంబర్ మోతె తిరుపతి, ఎంపీపీ మంత్రి బాపు, కౌన్సిలర్లు రెవెళ్లి మహేశ్, జగన్నాథుల శ్రీనివాస్, పెండ్యాల లక్ష్మణ్, వేల్పుల సుధాకర్, తలారి మురళి, ఆసంపెల్లి సంపత్, మాడిశెట్టి విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌తోపాటు వంద మంది బైకులపై అక్కడికి చేరుకున్నారు. మిర్చి రైతులతో మాట్లాడుతున్న బీజేపీ లీడర్లపై మూకుమ్మడిగా కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు. అందుగుల శ్రీనివాస్​ను తీవ్రంగా కొట్టడంతో కుడిచేయి విరిగింది. ఛాతీ, వీపు, పొట్ట, కాలుకి గాయాలయ్యాయి. సుద్దపల్లి సుశీల్ కుమార్‌‌‌‌‌‌‌‌, గడిపెల్లి సంతోష్ కూడా గాయపడ్డారు.
గంట దాకా పోలీసులు రాలే
టీఆర్ఎస్ లీడర్లు దాడి చేస్తుండటంతో డయల్ 100కు బీజేపీ కార్యకర్తలు ఫోన్ చేశారు. కానీ పోలీసులు ఆలస్యంగా స్పందించారని బీజేపీ లీడర్లు తెలిపారు. దాడి జరిగిన గంట సేపటికి ఎస్సైలు చంద్రశేఖర్, వెంకట్ సంఘటన స్థలానికి వచ్చారు. తర్వాత సీఐ ప్రవీణ్​కుమార్ చేరుకున్నారు. బాధితులను హాస్పిటల్‌‌‌‌కు తరలించేందుకు ప్రయత్నించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పది నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటారని, ఆయన వచ్చాక హాస్పిటల్‌‌‌‌కు వెళ్తామని నేతలు చెప్పారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు బీజేపీ లీడర్లను లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే వివేక్ వెంకటస్వామి అక్కడికి చేరుకోవడంతో శాంతించారు. గాయపడ్డ వారిని చెన్నూర్ హాస్పిటల్​కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అందుగుల శ్రీనివాస్‌‌‌‌ను మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్ కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హాస్పిటల్ ఎదుట ధర్నా
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముల్కల్ల మల్లారెడ్డి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి కొయ్యల ఏమాజీ, జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూదన్‌‌‌‌రావు, నస్పూర్ టౌన్ ప్రెసిడెంట్ అగల్డ్యూటి రాజు తదితరులు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ లీడర్లపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, వాళ్లను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ఎదుట మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. పోలీసులు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌‌‌కు తీసుకెళ్లారు. రైతుల పక్షాన పోరాడుతున్న తనను చంపడానికి ఎమ్మెల్యే బాల్క సుమన్ కుట్ర చేశాడని, అందుకే టీఆర్ఎస్ లీడర్లు కర్రలు, రాడ్లతో హత్యాయత్నం చేశారని అందుగుల శ్రీనివాస్ ఆరోపించారు.
కేసీఆర్ డైరెక్షన్‌‌‌‌లోనే బాల్క సుమన్ గూండాగిరి: వివేక్ 
చెన్నూర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ డైరెక్షన్‌‌‌‌లోనే ఎమ్మెల్యే బాల్క సుమన్ గూండాగిరి చేయిస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ అందుగుల శ్రీనివాస్, సుశీల్‌‌‌‌కుమార్, సంతోష్, వెంకటేశ్వర్లుగౌడ్‌‌‌‌లను పరామర్శించారు. మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన బీజేపీ లీడర్లపై టీఆర్ఎస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌‌‌‌‌‌‌‌తో నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయని చెప్పారు. రైతులను ఆదుకోవాలని అందుగుల శ్రీనివాస్ సహా మిగతా లీడర్లు పోరాడుతున్నారని చెప్పారు. 
చెన్నూరులో బీజేపీకి ప్రజల ఆదరణ పెరగడాన్ని టీఆర్ఎస్ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. నియోజకవర్గంలో బాల్క సుమన్ గూండారాజ్యం నడుస్తోందన్నారు. సుమన్ ఆదేశాలతోనే ఆయన అనుచరులు తమ పార్టీ నాయకులను చంపే ప్రయత్నం చేశారన్నారు. ఇటీవల కేకే5 మైన్‌‌‌‌లో బీఎంఎస్ మీటింగును అడ్డుకునేందుకు టీబీజీకేఎస్ లీడర్లు ప్రయత్నించి కార్మికులతో తిట్లు తిన్నారని తెలిపారు. అక్రమ కేసులు, దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని, ప్రజల పక్షాన మరింత గట్టిగా పోరాడుతామని అన్నారు. బాల్క సుమన్‌‌‌‌కు ఓటమి భయం పట్టుకుందని, పీకే రిపోర్టులో ఓడిపోయే ఎమ్మెల్యే లిస్టులో టాప్ 10లో సుమన్ ఉన్నాడని చెప్పారు. దాడి చేసిన వారిపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.