నిజామాబాద్ బీజీపీ ఎంపీ అర్వింద్ కు టీఆర్ఎస్ నేతల హెచ్చరిక

నిజామాబాద్ బీజీపీ ఎంపీ అర్వింద్ కు టీఆర్ఎస్ నేతల హెచ్చరిక

హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్.. హద్దు మీరి మాట్లాడుతున్నారన్న దానం నాగేందర్.. అర్వింద్ లా తాము మాట్లాడలేమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని, చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ పథకాలను ఎన్నో ప్రవేశపెట్టారని చెప్పారు. బీజేపీ నాయకులు అభివృద్ది నిరోధకులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడిన విధానం గురించి బీజేపీ అధినాయకత్వం నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ అర్వింద్ ను హెచ్చరించారు. టీఆర్ఎస్ కార్యకర్తల ను జైల్లో పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. 

రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారు : బొంతు రామ్మోహన్ 

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ కవిత పోలీసు కేసులను ధైర్యంగా ఎదుర్కొని..పోరాడారని టీఆర్ఎస్ సీనియర్ నేత బొంతు రామ్మోహన్ అన్నారు. కేసీఆర్ పోరాటం వల్లే బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని, రాష్ట్రం అభివృద్ధి కాకుండా చేయాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర బీజేపీ నాయకులు రెచ్చిపోతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నేత పూల రవీందర్ ఆరోపించారు. ఎంపీ అర్వింద్ కులం పేరుతో మాట్లాడటం విడ్డూరంగా ఉందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీల గురించి పార్లమెంటులో ఏనాడూ మాట్లాడలేదన్నారు.