షర్మిలకు నర్సంపేట ఎమ్మెల్యే వార్నింగ్

షర్మిలకు నర్సంపేట ఎమ్మెల్యే వార్నింగ్
  • నాకు వేల కోట్ల ఆస్తులు చూపిస్తే ప్రజలకు  రాసిస్తా.. లేకపోతే మీ భూముల్లో జెండాలు పాతుతాం
  • జగన్​ సమాధానం చెప్పకుంటే.. ఏపీలోకి ఎంటరైతమని కామెంట్

నర్సంపేట, వెలుగు: హైకోర్ట్​ ఆదేశాలను తాము గౌరవిస్తామని.. అయితే షర్మిల మళ్లీ  కేసీఆర్, కేటీఆర్, తమ ఎమ్మెల్యేలపై నోరు జారి మాట్లాడితే ఆమె పాదయాత్ర ఆగిపోవడం ఖాయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి హెచ్చరించారు. నర్సంపేటలోని క్యాంప్​ ఆఫీసులో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్​, కేటీఆర్​తో పాటు తనపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం వల్లే ప్రజలు, తమ అభిమానులు, టీఆర్ఎస్​ శ్రేణులు షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారని చెప్పారు.తనకు వేల కోట్ల ఆస్తులు ఉంటే చూపించాలని, తానే ప్రజలకు రాసిస్తానని, లేకపోతే ప్రతి జిల్లాలో మీకు (షర్మిల) ఉన్న వందలాది ఎకరాల భూముల్లో జెండాలు పాతుతామని పేర్కొన్నారు. వరంగల్​ జిల్లా చిట్యాల మండలం నవాబుపేటతో పాటు, సంగారెడ్డి జిల్లా గూడూరులో వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణలో కుట్రలు చేసేందుకే షర్మిల రూపంలో బీజేపీ బాణం విడిచిందని ఆయన ఆరోపించారు.

నర్సంపేటలో ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పందించారంటే కుట్ర కోణం దాగి ఉందన్నారు. కేసీఆర్​పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసినా గవర్నర్​ తమిళి సై స్పందించలేదని, అదే నర్సంపేటలో ఘటన తర్వాత స్పందించడం ఆక్షేపణీయమన్నారు. ‘‘వైఎస్​ హయాంలో టీఆర్ఎస్​ పార్టీ గొంతు నులిమింది వాస్తవం కాదా. అప్పటి నర్సంపేట ఎమ్మెల్యే కంభంపాటి లక్ష్మారెడ్డితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన విషయం తెలంగాణ సమాజం మరిచిపోలేదు. లక్షల కోట్ల విలువైన బయ్యారం గుట్టలను స్వాహా చేసేందుకు వైఎస్​ ప్రయత్నించగా టీఆర్ఎస్​ మూడురోజుల పాటు పోరాటం చేసి అడ్డుకున్న విషయం అందరికీ తెల్సిందే. ఏపీలో సమస్యలు లేవా? అక్కడి సమస్యల కోసం పనిచేయకుండా తెలంగాణలో నీకు (షర్మిల) ఏం పని?”  అని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల ఎపిసోడ్​పై ఏపీ సీఎం జగన్​ స్పందించాలని, లేకపోతే తాము కూడా ఏపీలో పర్యటించి షర్మిల ఇక్కడ మాట్లాడిన విధంగా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.