పీకే సర్వే రిపోర్టులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు

పీకే సర్వే రిపోర్టులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు
  • సర్వే రిపోర్టులు ఎవరిని ముంచుతయోనని టెన్షన్ 
  • ప్రగతి భవన్‌‌కు టచ్‌‌లో ఉండే నేతలతో తమ పరిస్థితిపై ఆరా

హైదరాబాద్‌‌, వెలుగు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌‌ కిశోర్‌‌  రిపోర్టులు ఎవరిని ముంచుతాయోనని టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు హైరానా పడుతున్నారు. సగం మందికిపైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, వారిలో 35 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా పీకే లీకులు ఇస్తున్నారు. నిరుడు డిసెంబర్‌‌ నుంచి వరుసగా నిర్వహిస్తున్న సర్వేల్లో వారి గ్రాఫ్‌‌ ఇంకా పడిపోతున్నదని కేసీఆర్‌‌కు పీకే రిపోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ 35 మందిలో ఎవరెవరు ఉన్నారనే చర్చ టీఆర్​ఎస్​లో జోరుగా సాగుతున్నది. ఏ ఇద్దరు ముగ్గురు టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు కలిసినా పీకే సర్వేపైనే చర్చించుకుంటున్నారు. ఇటీవల పెండ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లోనూ నేతల మధ్య ప్రశాంత్‌‌ కిశోర్‌‌ సర్వేలకు సంబంధించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంటున్నది. ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉన్న 35 మందిలో తామున్నామా.. తమ పరిస్థితి ఏమిటి.. అనే వివరాలు సేకరించేందుకు ప్రగతి భవన్‌‌కు టచ్‌‌లో ఉండే నేతలను తరచూ కాంటాక్ట్ చేస్తున్నారు.

ఏప్రిల్​, మే రిపోర్టుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత!

ప్రశాంత్‌‌ కిశోర్‌‌కు చెందిన ఐప్యాక్‌‌ టీం గతేడాది డిసెంబర్‌‌, ఈ ఏడాది జనవరి నెలల్లో రాష్ట్రంలో ర్యాండమ్‌‌ సర్వే నిర్వహించింది. ఈ ప్రిలిమినరీ సర్వేలో ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్‌‌ టాక్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా కనిపించింది. ఫిబ్రవరి నుంచి పీకే టీం రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నది. ప్రతి నెల ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి పలు రకాల సమాచారం సేకరిస్తున్నది. 

వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌‌ బ్యాక్‌‌ ఆధారంగా రిపోర్టులు తయారు చేసి టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌కు ఇస్తున్నది. పైకి అంతా బాగానే ఉందని చెప్తున్నా.. ఏప్రిల్‌‌, మే నెలల్లోని సర్వే రిపోర్టుల ప్రకారం రాష్ట్ర  ప్రభుత్వంపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలినట్టు సమాచారం. బస్సు టికెట్లు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఆసరా పింఛన్లు ఆలస్యంగా ఇస్తుండటంతో కొందరు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి తోడు ఎమ్మెల్యేలపై ప్రజలు మండిపడుతుండటంతో ఆయా సీట్లలో అభ్యర్థులను మార్చడం ఖాయమని నేతల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలోనూ సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని కేటీఆర్‌‌ తేల్చిచెప్పారు. దీంతో పీకే సర్వే రిపోర్టులు తమ పీకకు ఎక్కడ చుట్టుకుంటాయోని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

పీకే సర్వేనే ప్రామాణికమా?

ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న 35 మందిలో సగానికి పైగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లే ఉన్నట్టు నేతల్లో చర్చ నడుస్తున్నది.  మిగతా వాళ్లు రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచినవాళ్లని సమాచారం. ఈ జాబితాలో ఐదారుగురు మంత్రులు కూడా ఉన్నారని టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు చెప్తున్నాయి. తమపై ప్రజాభిప్రాయం ఎలా ఉందనే సమాచారం ఆయా మంత్రులకు తెలుసని, ఎమ్మెల్యేలు ఎవరనే విషయం పార్టీలో కీలకంగా వ్యవహరించే ముగ్గురు, నలుగురు నేతలకు మినహా మిగతా ఎవ్వరికీ తెలియదని ప్రగతి భవన్‌‌తో సన్నిహిత సంబంధాలు ఉండే నాయకులు అంటున్నారు. మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ పుట్టి మునగడం ఖాయమనే అంచనాకు కేసీఆర్‌‌ వచ్చినట్టు తెలుస్తున్నది. ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థుల ఎంపికకూ పీకే సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటున్నారని సమాచారం. పీకే సర్వేలో ప్రజల్లో పాజిటివ్‌‌ టాక్ ఉన్న ఇతర పార్టీల నేతలతో పాటు టీఆర్‌‌ఎస్‌‌కు దూరంగా ఉంటున్న వారిపై టీఆర్​ఎస్​ చీఫ్‌‌ ఫోకస్‌‌ పెట్టినట్టు తెలుస్తున్నది.

అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్‌‌ ఇదివరకే చెప్పారు. షెడ్యూల్‌‌ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్‌‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ ముందస్తుకు వెళ్తే కర్నాటకతో పాటు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌‌లో ఎన్నికలు ఉండవచ్చని టీఆర్‌‌ఎస్‌‌లో చర్చ జరగుతున్నది. ఇదే జరిగితే ఈ ఏడాది నవంబర్‌‌, డిసెంబర్‌‌లోనే పార్టీ క్యాండిడేట్లను ప్రకటించేలా అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై పార్టీలో బాహాటంగానే చర్చిస్తున్నా.. ఎమ్మెల్యేల వారీగా ఎవరి టికెట్లకు కత్తెర పడుతుంది.. ఎవరు సేఫ్‌‌ అనే వివరాలు మాత్రం చెప్పడం లేదు. దీంతో తమ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు.