మీరు జై శ్రీ రామ్ అంటే... మేము జై హనుమాన్ అంటం

మీరు జై శ్రీ రామ్ అంటే... మేము జై హనుమాన్ అంటం

జగిత్యాల: బీజేపీ జై శ్రీ రామ్ అంటే... తాము జై హనుమాన్ అంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శనివారం కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి పక్షాలపై నిప్పులు చెరిగారు. దేవుడి పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని... దేవుని పేరు చెప్పి బెదిరించాలని చూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. దేవుడి కంటే భక్తులు, నాయకుల కంటే ప్రజలే గొప్ప వాళ్లని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు వంటి ఎన్నో గొప్ప పథకాలతో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీడీ కార్మికులకు రూ.700 పెన్షన్ ఇస్తోంటే... రాష్ట్రంలో రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్నామని అన్నారు.

ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కేవలం 20 పైసలు మాత్రమే పేదలకు చేరుతోందని... మిగతా 80 పైసలు నాయకుల జేబుల్లోకి వెళ్తోందని కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. కానీ అది కాంగ్రెస్ పాలనలోనని... టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి ప్రజలకే చేరుతోందని గర్వంగా చెప్పారు. జీవో 317 ప్రకారం 95 శాతం ప్రభుత్వ కొలువులు స్థానికులకే ఇస్తున్నామని... యువకులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉద్యోగాల కోసం సమాయత్తం కావాలని కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరూ గర్వపడాలని, ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం...

ఇంట్లో దాచిన రూ. 4 లక్షలతో చిన్నారుల జల్సాలు..!

యుద్ధంపై రష్యా కీలక ప్రకటన