
ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అధ్యక్షతన నిర్వహించే ఈ మీటింగ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్ర సాయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలపై ఎంపీలకు కేటీఆర్ సూచనలు చేస్తారు. పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమయ్యేలోగా ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తే అవకాశముందని టీఆర్‌ఎస్ గుర్తించింది. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా స్పందించాలో కూడా ఎంపీలకు సూచించనున్నట్టు సమాచారం. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉందని, కేంద్రం తెచ్చిన మోటార్ వెహికిల్ యాక్ట్‌లోనే రూట్ల ప్రైవేటీకరణ అంశం ఉందనే విషయాన్ని బలంగా చెప్పాలని సూచించనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై రాజ్యసభ, లోక్‌సభల్లో ఎవరెవరు మాట్లాడాలి అనే విషయంలోనూ ఇదే మీటింగ్‌లో స్పష్టత ఇవ్వనున్నారు. వారికి ఆయా అంశాలపై లోతుగా అవగాహన కల్పించనున్నట్టు సమాచారం.