
- మలి దశలో తిండి కోసం పండుటాకుల తిప్పలు
- ఆర్డీవో ఆఫీసుల్లో పెరుగుతున్న మెయింటెనెన్స్కేసులు
- వృద్ధులకు అండగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్
మంచిర్యాలకు చెందిన ఓ అవ్వకు 80 ఏండ్లు. భర్త పదేండ్ల కింద చనిపోయాడు. ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఆస్తి కోసం కొడుకులు గొడవ పడుతూ తల్లిని ఇంట్లోంచి తరిమేశారు. దీంతో సాయిబాబా గుడి దగ్గర దాతలు పెట్టింది తింటూ కడుపు నింపుకుంది. అక్కడ కూడా తల్లికి అన్నం పెట్టొద్దని దాతలను చిన్నకొడుకు బెదిరించాడు. దీంతో కరీంనగర్‌లోని కూతురు దగ్గరకు వెళ్లింది. అల్లుడు చనిపోవడంతో బిడ్డ బతకడమే కష్టంగా ఉందని, తనకు ఓ దారి చూపించాలని కోరుతూ ఇటీవల జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించుకుంది. ఇది ఆ ఒక్క వృద్ధురాలి పరిస్థితి మాత్రమే కాదు, ఆమె లాగా వయసు మళ్లిన వందల మంది తల్లిదండ్రులదీ ఇదే దుస్థితి.
మంచిర్యాల, వెలుగు:ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అందుకోసం జీవితాలను దారబోస్తారు. కానీ, వారి కడుపున పుట్టిన పిల్లలు మాత్రం కన్నవారిని కాదనుకుంటున్నారు. వయసు పైబడగానే పేరెంట్స్‌ను భారంగా భావించి వదిలించుకుంటున్నారు. ఆస్తులను గుంజుకొని వాళ్లను ఇంట్లోంచి తరిమేస్తున్నారు.
కొంతమంది ఆస్తులు పంచుకున్నట్టే అమ్మానాన్నలను పంచుకుంటున్నారు. మరికొందరైతే దూరప్రాంతాల్లో ఒంటరిగా వదిలేసి కసాయితనం చూపుతున్నారు. ఇలా చాలా మంది జీవిత చరమాంకంలో బుక్కెడు బువ్వకు తిప్పలు పడుతున్నారు. కని పెంచిన కొడుకులు, బిడ్డలు ఉన్నా.. ఎవరూ లేని అనాథలుగా మిగిలిపోతున్నారు. ఓవైపు వయోభారం, మరోవైపు అనారోగ్య సమస్యలు, ఇంకోవైపు కొడుకులు, బిడ్డలు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో కుమిలిపోతున్నారు.
ఆస్తి రాయించుకొని వదిలేసిన్రు..
మందమర్రి మండలానికి చెందిన ఓ పెద్దాయనకు ఇప్పుడు 85 ఏండ్లు. ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు సంతానం. భార్య దశాబ్దాల కిందటే చనిపోయింది. అప్పటినుంచి కొడుకు దగ్గరే ఉంటూ చుట్టపు చూపుగా కూతుళ్ల దగ్గరికి వెళ్లొచ్చేవాడు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఉన్న 4 ఎకరాల భూమిని నలుగురు బిడ్డలు కలిసి ఒకరి పేరిట గిఫ్ట్ డీడ్ చేసుకున్నారు. నాలుగైదు సంవత్సరాలుగా ఆ బిడ్డ ఇంటికీ, ఈ బిడ్డ ఇంటికీ తిప్పుకుంటూ వేధించడం మొదలుపెట్టారు.
ఇటు కూతుళ్ల దగ్గర ఉండలేక, అటు కొడుకు దగ్గరికి పోలేక ఆ పెద్దాయన ఓ గుడిలో తలదాచుకున్నాడు. అది చూసిన గ్రామస్తులు ఆ వృద్దుడిని కొడుకు దగ్గరికి పంపించారు. కూతుళ్లు మాయమాటలు చెప్పి తన భూమిని రాయించుకున్నారని, గిఫ్ట్ డీడ్ ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఆర్డీవోకు దరఖాస్తు చేయగా, కేసు పెండింగ్‌లో ఉంది.
నస్పూర్ మండలం సింగపూర్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మరో వృద్ధుడిది ఇదే గాథ. బార్య చనిపోయింది. ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండు నెలల కింద కాలు విరిగి అవస్థలు పడుతుంటే కొడుకులు పట్టించుకోలేదు. కూతురు తండ్రిని చేరదీసి రూ.2 లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్ చేయించింది. అతడు సింగరేణి భూనిర్వాసితుడు కావడంతో ఆర్అండ్ఆర్ కాలనీలో రెండు గుంటల ప్లాట్ వచ్చింది. ఆ ప్లాట్ పేపర్లను పెద్దకొడుకు తండ్రికి తెలియకుండా తీసుకెళ్లాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ గత నెల 23న గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. ఆర్డీవో కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇలా ఒక్క మంచిర్యాల ఆర్డీవో దగ్గరే 79 కేసులు నమోదయ్యాయి.
పోరాడి గెలిచిన తండ్రి..
జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడికి 85 ఏండ్లు. భార్య చనిపోగా, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల భూమిని పెద్దకొడుకు, రెండో కొడుకు కలిసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వారి పేరిట గిఫ్ట్ డీడ్ చేయించుకున్నారు. ఆ తరువాత తండ్రి బాగోగులు చూడకపోవడంతో చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాడు. వారు అక్రమంగా చేయించుకున్న పట్టాను రద్దు చేయడంతో పాటు తనకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చేలా చూడాలని కోరుతూ ఆర్డీవోను ఆశ్రయించాడు. దీంతో ముగ్గురు కొడుకులు నెలకు రూ.4 వేల చొప్పున తండ్రికి చెల్లించాలని ఆర్డీవో తీర్పు ఇచ్చారు.
అండగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్..
సీనియర్ సిటిజన్ చట్టం(మెయింటనెన్స్అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007) వృద్ధులకు అండగా నిలుస్తోంది. 60 ఏండ్లు దాటిన వారికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 2011లో దీనిని మరింత పటిష్టం చేసింది. తల్లిదండ్రులు, వయసు మళ్లిన కుటుంబసభ్యులను వదిలించుకోవాలని చూసినా, పోషణ, ఆరోగ్య, సంరక్షణ బాధ్యతలు మరిచినా చట్టప్రకారం శిక్షార్హులవుతారు.
కన్న పిల్లలే కాకుండా దత్తత సంతానం, సవతి పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, ఆస్తి అనుభవించేవారు పెద్దల సంరక్షణ బాధ్యతలు చూడాల్సిందే. లేదంటే కేసు తీవ్రతను బట్టి ఆర్నెళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పంపకాలు జరిపిన వారసత్వ ఆస్తుల్ని సైతం తిరిగి వృద్దులకు ఇచ్చేలా ఈ చట్టం రూపొందించింది. వారసులు ఎంప్లాయీస్ అయితే వారి జీతాల్లోంచి డబ్బు కట్ చేసి తల్లిదండ్రులకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చే చాన్స్ ఉంది. బాధితులు ఆర్డీవోను సంప్రదించి న్యాయం పొందవచ్చు.