
- ‘స్థానిక’ ఎమ్మెల్సీ పోరుపై టీఆర్‌ఎస్ దిశానిర్దేశం
- ప్రత్యర్థి పార్టీ ఓటర్లను తిప్పుకోవాలని సూచన
- రంగంలోకి దిగిన కీలక నేతలు
- కాంగ్రెస్ ప్రతివ్యూహాలు
- క్యాంపు రాజకీయాలకు తెరలేపే ఎత్తు గడలు
హైదరాబాద్, వెలుగు: లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలనూ గెలుచుకోవాలని అధికార టీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన నల్గొండను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వ్యూహాలు పన్నుతోంది. ప్రతిపక్షాల్లో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీఆర్‌ఎస్ వైపు తిప్పుకోవాలని, వెంటనే కార్యాచరణకు దిగాలని నేతలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పలువురు కీలక నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్సీ సీటుపై వారు ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు సమాచారం. రంగారెడ్డి లోకల్‌బాడీ ఎమ్మెల్సీని సునాయాసంగా గెలుచుకోవచ్చని టీఆర్‌ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. నల్లగొండ, వరంగల్ సీట్లకు మాత్రం సరిపడా సంఖ్యాబలం లేదని లెక్కలు వేస్తున్నారు. ఆ రెండు సీట్లను కూడా సులువుగా గెలుచుకునేలా ‘లోకల్‌బాడీ’ఓటర్లకు భారీగా తాయిలాలు ఇస్తామని ఆశజూపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో అసంతృప్తులతో..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున నేతలు వలస వచ్చారు. వారితోపాటు ద్వితీయశ్రేణి కేడర్ కూడా గులాబీ గూటికి చేరింది. అయితే వారిలో చాలా మందికి పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. సిట్టింగ్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సైతం టికెట్లు రాలేదు. రిజర్వేషన్లు అనుకూలించక కొందరిని, ఇతర నేతలను సర్దుబాటు చేసే క్రమంలో మరికొందరిని పక్కనపెట్టాల్సి వచ్చింది. దీంతో క్షేత్ర స్థాయి నాయకుల్లో విభేదాలు వచ్చి, అసంతృప్తులు మొదలయ్యాయి. వారిని బుజ్జగించడం ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలకు తలనొప్పిగా మారింది. అలాంటి వారు ప్రతిపక్ష అభ్యర్థులకు సహకరించే అవకాశం ఉండటంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు.
కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ..
కాంగ్రెస్ పార్టీ కూడా లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ నేతలు ఇప్పటికే లోకల్ ప్రతినిధులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. నల్లగొండ సీటును నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. అర్థ బలం, అంగబలమున్న నేతనే పోటీకి దిగడంతో సొంత పార్టీ వాళ్లతోపాటు, టీఆర్‌ఎస్ ఓటర్లనూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలా మద్దతు కూడగట్టుకుని, 15వ తేదీ నుంచి క్యాంపులకు తరలించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది టీఆర్‌ఎస్ నాయకత్వానికి చేరడంతో అప్రమత్తమై.. జిల్లా నేతలను రంగంలోకి దింపినట్టు తెలిసింది.
ఒక్కో ఓటుకు రూ.2 లక్షలు!
లోకల్ బాడీ ఓటర్లయిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమకు ఓటేస్తే రూ.2 లక్షల చొప్పున ఇస్తామని అధికార, విపక్షాలు ఆఫర్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలాన్ని ప్రభావితం చేయడగల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కీలకంగా ఉండే చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఇంకా ఎక్కువే ముట్టజెప్పేందుకు నేతలు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఓటర్లెవరూ జారిపోకుండా సొంత పార్టీల నేతలకూ సొమ్ము ముట్టజెప్పి, క్యాంపులకు తీసుకెళ్లేలా వ్యూహాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది.