టీఆర్‌ఎస్‌ రెండు బిల్లులాట

టీఆర్‌ఎస్‌ రెండు బిల్లులాట
  • అటు బీజేపీ, ఇటు ఎంఐఎంతో డ్యూయల్ రోల్
  • ఆర్టీఐ సవరణకు వ్యతిరేకమంటూనే మద్దతు
  • తలాక్ బిల్లుపై ఇద్దరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం
  • గైర్హాజరుతో పరోక్షంగా బిల్లు నెగ్గేందుకు సహకారం
  • బిల్లును వ్యతిరేకించామంటూ బయట ప్రకటనలు

వెలుగు బ్యూరో: పార్లమెంట్‌లో సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లుల విషయంలో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్టీఐ చట్ట సవరణకు వ్యతిరేకమని మొదట చెబుతూ వచ్చిన గులాబీ నేతలు ఒక్కరోజులోనే మనసు మార్చుకొని కేంద్ర బిల్లుకు మద్దతిచ్చారు. ఇదే సమయంలో ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఓటింగ్ కు దూరంగా ఉండడం ద్వారా వ్యతిరేకించినట్లుగా చెప్పుకున్నారు. అయితే రాజ్యసభలో అధికార కూటమికి పూర్తి మెజారిటీ లేని పరిస్థితిలో టీఆర్ఎస్ గైర్హాజరుతో పరోక్షంగా బిల్లు పాస్ కావడానికి సహకరించిందన్న సంకేతాలు వెళ్లాయి.

కేంద్రంలో మోడీ సర్కారు మొదటి టర్మ్ లో పెద్దల సభలో ఎన్డీఏకు మెజార్టీ లేదు. దీంతో చాలా బిల్లులు లోక్ సభలో నెగ్గినా రాజ్యసభలో ఆగిపోయాయి. అయితే ఐదేండ్లలో పలు రాష్ట్రాల్లో అధికారం సాధించిన బీజేపీ క్రమక్రమంగా బలం పెంచుకుంటూ వచ్చింది. ఒకదశలో దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. రాజ్యసభలోనూ బీజేపీ పట్టును పెంచుకుంటూ పోయింది. అయినా మెజారిటీ నంబర్​కు దూరంగానే ఉండిపోయింది. రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 ఏండ్లు కావడం, రెండేళ్లకోసారి మూడోవంతు మంది సభ్యులు మారాలి కాబట్టి ఇప్పటికీ బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. సభలో మొత్తం 240 మంది ఉంటే ఎన్డీఏ బలం 107 మాత్రమే. దీంతో రాజ్యసభలో బిల్లులు పాస్ చేయించుకోవడానికి ప్రాంతీయ పార్టీల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి.

రెండోసారి మారిన ట్రెండ్

రెండోసారి కూడా మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చాక బీజేపీ దూకుడు పెంచింది. గత టర్మ్​లో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై హైకమాండ్ పెద్దగా దృష్టిపెట్టలేదు. ఈసారి మాత్రం కర్నాటక తర్వాత సౌతిండియాలో తెలంగాణలోనే అధికారం సాధిస్తామని చెబుతోంది. అందుకే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రం నుంచే ప్రారంభించారు. ఇదే సమయంలో పలు అంశాలపై నిరసనలు, కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల వేడి పెంచుతున్నారు. ఇక రాజ్యసభలో బిల్లుల విషయంలో ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకునే ప్రయత్నంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి పెద్దల సభలో ఆరుగురు సభ్యులున్నారు. దీంతో పాస్ కావడం కష్టమని భావించిన కీలక బిల్లులు నెగ్గడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా టీఆర్ఎస్ సహకరించింది. ఆర్టీఐ చట్ట సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లులను నెగ్గించుకోవడంలో కేంద్రం సక్సెస్ అయ్యింది. సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు విషయంలో మద్దతిచ్చేది లేదని టీఆర్ఎస్ రాజ్యసభా పక్షనేత కె.కేశవరావు మొదట్లో చెప్పారు. బిల్లుకు మద్దతివ్వాలని బీజేపీ కోరడంతో సభలో అనుకూలంగా టీఆర్ఎస్ ఓటేసింది. పైగా ఆర్టీఐ సవరణల వల్ల ప్రభుత్వాలకు సమాచార కమిషనర్లపై నియంత్రణ వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో సమాచార హక్కు అమలుతీరుపై చాలా విమర్శలు ఉన్నాయి. కనీసం ఐదుగురు కమిషనర్లను నియమించాల్సి ఉండగా రాష్ట్ర సర్కారు ఇద్దరినే నియమించింది. దీంతో బిల్లుకు మద్దతివ్వడం వల్ల సర్కారుకు వచ్చే నష్టం లేదని భావించి, బీజేపీ అడిగిన వెంటనే సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో టీఆర్ఎస్ కొంత సంకటంలో పడింది. బిల్లుకు మద్దతిస్తే రాష్ట్రంలో మైనారిటీలకు దూరమవుతామన్న భయంతో పాటు మిత్రపక్షమైన ఎంఐఎం నొచ్చుకుంటుంది. లోక్ సభలో ఇదే బిల్లును ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఇది నెగ్గాక కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఇంకోవైపు కేంద్రంలో ఐదేండ్లు అధికారంలో ఉండే పార్టీకి వ్యతిరేకంగా వెళ్లలేని పరిస్థితి. దీంతో మధ్యేమార్గంగా టీఆర్ఎస్ రాజ్యసభలో చర్చకు, ఓటింగ్ కు దూరంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. సభలో తలాక్ బిల్లు పాసైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ కేకే… ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు మూడేండ్ల జైలుశిక్ష మినహా మిగతా అన్ని అంశాలు బాగున్నాయని చెప్పారు. ఈ ఒక్క అంశాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందనీ, అందుకే చర్చలో, ఓటింగ్ లో పాల్గొనలేదన్నారు. అయితే బిల్లుకు నేరుగా మద్దతివ్వకపోయినా పరోక్షంగా సహకరించిందని సంకేతాలిచ్చినట్లైంది.