
- పెండింగ్ సమస్యలు తీర్చి.. పట్టు సాధించాలని టీఆర్ఎస్ ప్లాన్
నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను.. ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో పరిష్కరిస్తామన్న టీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పడు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. దీని వెనుక రాజకీయాలేంటన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. మునుగోడులో తమ సర్వసాన్ని ఒడ్డి పోరాడినా.. అత్తెసరు ఆధిక్యం మాత్రమే రావడం, ఇక్కడ టీఆర్ఎస్కు చుక్కలు చూపించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అతని అన్న వెంకటరెడ్డి మునుగోడు ఫలితాన్ని సీరియస్‌గా తీసుకుని ఉమ్మడి జిల్లాలోని మిగతా సీట్లపైనా గట్టిగా దృష్టి పెడతారన్న భయంతోనే అధికార పార్టీ వ్యూహం మార్చినట్టు భావిస్తున్నారు.1952 తర్వాత ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలను కైవసం చేసుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ కామెంట్ చేయడం ఇందులో భాగమేనంటున్నారు. గురువారం మునుగోడు అభివృద్ధిపై జరగాల్సిన సమీక్ష పరిధి ఉమ్మడి జిల్లాకు విస్తరించడానికి ఇదే కారణమంటున్నారు.
వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా..
సీఎం కేసీఆర్ దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విజిట్ చేసిన నాలుగైదు రోజుల్లోనే ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై కేటీఆర్ మునుగోడులో మీటింగ్పెట్టారు. వాస్తవానికి మునుగోడు బైపోల్ లో ఇచ్చిన హామీలపై చర్చించేందుకే ఈ మీటింగ్ పరిమితం కావాల్సింది. ఎన్నికల ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు మునుగోడులో పర్యటించి హామీలపై రివ్యూ చేస్తారని ప్రగతిభవన్‌లో ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ సీఎం కేసీఆర్ చెప్పారు. జిల్లా అధికారులు కూడా మునుగోడుకు సంబంధించిన రిపోర్టులే రెడీ చేశారని తెల్సింది. చివరి నిమిషంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమంపై రివ్యూ చేయాలని నిర్ణయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి రూ.1,544 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.
కోమటిరెడ్డి ఎఫెక్ట్ భయం
ఎనిమిదేండ్లలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమం గురించి మీటింగ్ పెట్టడం ఇదే ఫస్ట్‌టైం. 17 మంది మంత్రులు, 82 మంది ఎమ్మెల్యేలు రేయింబవళ్లు పని చేసినా మునుగోడులో టీఆర్ఎస్కేవలం పదివేల ఓట్ల తేడాతో గెలిచింది. బీజేపీకి ఊహించిన రీతిలో 83 వేల ఓట్లు వచ్చాయి. తక్కువ మార్జిన్ రావడాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజగోపాల్ రెడ్డి, ఆయన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడైతే టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని భావిస్తోంది. వీరి ప్రభావం ఉమ్మడి జిల్లాలో ఆరేడు నియోజకవర్గాలపై ఉంటుందని భయపడుతోంది. నల్గొండ, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మిర్యాలగూడ, సూర్యాపేటలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు బలముంది. అన్ని చోట్ల తమ క్యాడర్ జారిపోకుండా బ్రదర్స్ జాగ్రత పడుతున్నారు. పీసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకటరెడ్డి సొంత కేడర్‌పై దృష్టి పెట్టారు. ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తి నేతలు వీరికి టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
పెండింగ్ సమస్యలు తీర్చడమే టార్గెట్
ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు కంప్లీట్ చేయకపోతే మునుగోడు తరహాలో చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సివస్తుందని టీఆర్ఎస్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగానే 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన నల్గొండ జిల్లాను గుండెల్లో పెట్టుకుంటామని కేటీఆర్ప్రకటించారు.నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించాలంటే రోడ్లు, ప్రాజెక్టులు,పోడు భూములకు సంబంధించి పెండింగ్ సమస్యలను తీర్చడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్‌లో పోడు సమస్య సవాల్కానుంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సీఎం ప్రకటించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఇంకా సర్వే దశలోనే ఉన్నాయి. నిధుల్లేక భారీ సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు రెండేండ్లుగా మందగించాయి. వీటిమీద ఫోకస్‌పెట్టి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది.