టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రైవేట్ కంపెనీ

టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రైవేట్ కంపెనీ
  • మందబలంతో కవితను మండలికి పంపుతున్రు
  • కేసీఆర్ కుటుం బసభ్యులే అందులో వాటాదారులు
  • బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి

టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కాదని, అది ఓ ప్రైవేట్ కంపెనీ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి విమర్శించారు. అందులో కేసీఆర్ మొదటి వాటాదారు అయితే, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్​రావు, వినోద్ రావు, కవిత రావుకు వాటాలున్నాయన్నారు. నిజామాబాద్ ప్రజలు తిరస్కరిస్తే, దొడ్డి దారిన కవితను మండలికి పంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజాబలంతో కాకుండా, మందబలంతోనే కవితను మండలికి పంపుతున్నారన్నారు. బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ తరఫున మంత్రి తలసాని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వంటి బానిసలు ఎంత మంది వచ్చినా, వెలగబెట్టేది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇప్పిస్తానంటూ బీజేపీస్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ విసిరిన సవాల్ పై, దమ్ముంటే దొరను నేరుగా యుద్ధానికి పంపాలన్నారు.

పాకిస్తాన్ పోతే.. సీఏఏ అవసరం తెలుస్తది

రాజ్యాంగంలోని ఆర్టికల్7 ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేయకపోవడం నేరం అన్న విషయం కేసీఆర్ కు తెలియదా? అని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. పాస్ పోర్ట్, వీసాలు పక్కన పెట్టి టీఆర్ఎస్ బానిసలు పాకిస్తాన్ పోతే.. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అవసరం తెలుస్తుందన్నారు. కరీంనగర్ లో పీఎఫ్ఐ రాడికల్ ఎలిమెంట్స్ పని చేస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయన్నారు. ఉగ్రవాదం,  కిడ్నాప్ లతోపాటు, భైంసా, ఢిల్లీ అల్లర్లతోనూ పీఎఫ్​ఐకి లింకులు ఉన్నాయన్నారు. ఇంటలిజెన్స్ వైఫల్యం, ఎంఐఎం ప్రోత్సాహం వల్లే ఆ సంస్థకు చెందిన వ్యక్తులు కరీంనగర్ లో యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో భయంకరమైన కుట్ర జరుగుతోందని, వాస్తవాలను సర్కారు బయటపెట్టాలన్నారు.