కాళేశ్వరం అవినీతి సొమ్ముతో హుజూరాబాద్ ఉప ఎన్నికలు

కాళేశ్వరం అవినీతి సొమ్ముతో హుజూరాబాద్ ఉప ఎన్నికలు
  • తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది
  • ఇంకా 10 రోజుల టైం ఉంది.. మా టీమ్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుంది
  • కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్

కరీంనగర్: కాళేశ్వరం అవినీతి సొమ్మును హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వెదజల్లుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు 4లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇంకా 10 రోజుల టైం ఉంది.. మా టీమ్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం హుజురాబాద్ వెంకటసాయి గార్డెన్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ నేతలు శ్రీనివాస కృష్ణన్,  మల్లు రవి, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 
సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వచ్చిన అవినీతి సొమ్ముతో  ఉప ఎన్నికలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కిరోసిన్ ధరలు భారీగా పెరుగుతున్నాయని, ధరల పెరుగుదల పై... నిర్మల సీతారామన్, హరీష్ రావు లు సమాధానం చెప్పాలన్నారు. చారిత్రాత్మక రీతిలో ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన బీజేపీ తో స్ట్రాంగ్ ఫైట్ చేస్తామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న బల్మూరి వెంకట్ కు  క్లీన్ ఇమేజ్ ఉందని ధీమా వ్యక్తం చేశారు. 
దేశంలోనే అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ .. నియంత పాలన జరుగుతోంది
దేశంలోనే అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ అని.. రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు..అతి ఖరీదైన ఎన్నికలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని.. రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.