వరద సాయం పేరుతో TRS పేదోడి ఆత్మగౌరవంతో ఆడుకుంది

వరద సాయం పేరుతో TRS పేదోడి ఆత్మగౌరవంతో ఆడుకుంది

వరద సాయం పంపిణీ పేరుతో GHMC ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలన్న తపన తప్ప TRS ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మీ సేవా కేంద్రాల సామర్థ్యంపై సరైన అవగాహన, అంచనాలు లేకపోవడం, సాయం పంపిణీలో సరైన పద్ధతి పాటించకపోవడం, అడ్మినిస్ట్రేషన్ ఘోర వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఓ వైపు మహిళలు, పిల్లలు మీ సేవా కేంద్రాల దగ్గర గంటల తరబడి పడిగాపులు పడుతుంటే…కేసీఆర్, కేటీఆర్ కనీసం ఆ సమస్యను గుర్తించేందుకు సిద్ధంగా లేరన్నారు.

తండ్రీ కొడుకులు ఇద్దరు ఎలక్షన్లలో ఎలా డబ్బులు పంచాలి, ప్రజలను ఎలా మభ్యపెట్టాలి, మళ్లీ గ్రేటర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోవాలన్న ఆతృతే తప్ప ప్రజల కష్టాలు వీరికి పట్టడం లేదని విమర్శించారు. వరద సాయం పంపిణీలో ఇప్పటికే గులాబీ గద్దలు 200 కోట్లకు పైగా దోచేశాయన్నారు. ఈ దోపిడీకి గ్రేటర్ ప్రజలే ప్రత్యక్ష సాక్షులని… పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల టీఆర్ఎస్ నేతలకు కనీస సానుభూతి లేదన్నారు. వరద సాయంలో కమీషన్లు దండుకున్న ఈ ముఠాని గజదొంగలు అనక ఇంకేమనాలో చెప్పాలన్నారు. తండ్రీ కొడుకుల నిర్వాకంతో ఓ నిండు ప్రాణం బలైపోయిందన్నారు. వరద సాయం కోసం క్యూలైన్ లో చనిపోయిన మహిళ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

TRS చేసిన పాపం ఊరికే పోదని… సాయం పేరుతో రాజకీయం చేస్తూ పేదోడి ఆత్మగౌరవంతో ఆడుకున్న టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఓట్ల కోసం గల్లీకి వచ్చే టీఆర్ఎస్ లీడర్లను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని… చీపుళ్లతో తరిమికొట్టాలని పిలుపు నిస్తున్నాను. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి గ్రేటర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది. పేద, మధ్య తరగతికి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని ప్రెస్ నోట్ లో స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.