ఒకే పార్టీ రెండు వర్గాలు.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు

ఒకే పార్టీ రెండు వర్గాలు.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు

దసరా సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో TRS పార్టీకి చెందిన రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని జూలూరుపాడులో.. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మహబూబాబాద్‌లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఫ్లెక్సీల గొడవ తారాస్థాయికి చేరింది.

సూర్యాపేట జిల్లా చివ్వెంలలో దసరా వేడుకల్లో ఉద్రిక్తత ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. చిన్న వివాదంతో మొదలైన తోపులాట పిడిగుద్దుల వరకు వెళ్లింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామపెద్దలు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని జూలూరుపాడు మండల కేంద్రంలో.. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బతుకమ్మ ఊరేగింపులో 2 వర్గాలు ఎదురు కావటంతో గొడవకు దిగారు. అడ్డుకోబోయిన ట్రైనీ SI కార్తీక్ పై చేయి చేసుకోవటంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. జూలూరుపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గానికి, ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గానికి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మదన్ లాల్ వర్గానికి చెందిన ముఖ్య నేతలను.. ఎమ్మెల్యే రాములునాయక్.. టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయటంతో గొడవలు మరింత ముదిరాయి.

మహబూబాబాద్‌లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఫ్లెక్సీల గొడవ తారాస్థాయికి చేరింది. మహబూబాబాద్ పట్టణంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు చింపేశారు. దీనిపై ఎంపీ కవిత అనుచరులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్ తోపాటు 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అర్ధరాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరో 8 మంది పరారీలో ఉన్నారు. తమ అనుచరులను విడిచిపెట్టాలంటూ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. అర్ధరాత్రి అరెస్టులు ఏంటని పోలీసులను ప్రశ్నించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా దసరా ఉత్సవాల్లో ఘర్షణ జరిగింది. ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామస్తుల మధ్య గొడవ జరిగింది. వారిని సముదాయించే క్రమంలో డ్యూటీలో ఉన్న కుమార్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని లాక్కొని అతనిపైనే దాడి చేశారు పలువురు గ్రామస్తులు. చీకోడ్ దసరా ఉత్సవాల్లో ఏటా ఇలానే ఘర్షణలు జరుగుతున్నాయి. అందుకే పోలీసు బందోబస్తు పెట్టారు. అయినా కూడా గొడవ జరిగింది. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్టీలోని మోతుకుల గూడెం దసరా వేడుకల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు పోలీసులు. జగిత్యాల దసరా వేడుకల్లో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. జమ్మికోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. పబ్లిక్ ని కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆదిలాబాద్ దస్నాపూర్ మైదానంలో దసరా వేడుకల్లో అపశృతి జరిగింది. రావణ దహనం చేసిన వెంటనే పెద్దఎత్తున టపాసులు జనం వైపు దూసుకొచ్చాయి. దీంతో వేడుకలు చూడటానికి వచ్చిన జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. ఐతే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.