
మిర్యాలగూడ, వెలుగు: బస్తాలు కుట్టుకుని పొట్ట పోసుకుంటున్న వృద్ధురాలిపై నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం టీఆర్ఎస్ సర్పంచ్ బంధువులు దాడి చేశారు. దాంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగింది. వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెంకు చెందిన చంద్రమ్మకు సర్వే నంబర్88లోని బంచరాయి భూమిలో 2012లో అప్పటి ప్రభుత్వం 121 గజాల స్థలం ఇచ్చింది. ఇటీవల అందులో చంద్రమ్మ ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆ స్థలం తమదంటూ సర్పంచ్అశోక్ రెడ్డి బంధువులు బ్రహ్మారెడ్డి, సైదిరెడ్డి గురువారం నిర్మాణంలో భాగంగా నిలబెట్టిన దర్వాజాను పడేశారు. ఇదేందని అడిగిన చంద్రమ్మపై దాడి చేశారు. సర్పంచ్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన చంద్రమ్మ పురుగుల మందు తాగింది. స్థానికులు వెంటనే ఆమెను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై చంద్రమ్మ కూతురు సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు.