నేడు టీఆర్ఎస్​ రాష్ట్ర కమిటీ భేటీ

నేడు టీఆర్ఎస్​ రాష్ట్ర కమిటీ భేటీ

    మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చ

    నేతల అభిప్రాయాలు

    తీసుకోనున్న కేటీఆర్

    బీజేపీ, కాంగ్రెస్ ప్రభావిత మున్సిపాల్టీలపై ఫోకస్

మున్సిపల్​ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. తెలంగాణ భవన్​లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరు కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే మున్సిపల్​ ఎన్నికల ఇన్​చార్జ్​లను టీఆర్ఎస్ నియమించింది. స్థానికంగా పార్టీ పరిస్థితులపై వారు కేటీఆర్ కు ఓ నివేదికను అందించినట్టు తెలిసింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఎన్నికల వ్యూహం ఉండే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్, బీజేపీలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేటీఆర్ నేతల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ అభ్యర్థులపై టీఆర్ఎస్ ఇప్పటికే ఓ సర్వే జరిపించిందని తెలిసింది. ప్రస్తుత కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై చాలా చోట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ఈ సర్వేలో తేలినట్టు సమాచారం. ఉమ్మడి కరీంగనర్, నిజామాబాద్ జిల్లాల్లోని మున్సిపాల్టీల్లో ఎక్కువ మంది సిట్టింగ్ లపై నెగెటివ్ ఉన్నట్టు తెలిసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్తవారికి టికెట్ దక్కే అవకాశం ఉంది.

బీజేపీ, కాంగ్రెస్ ప్రభావంపై టెన్షన్

కాంగ్రెస్, బీజేపీల ప్రభావం మున్సిపల్​ ఎన్నికల్లో ఉంటుందని టీఆర్ఎస్ నేతలు అంతర్గత సమావేశాల్లో ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మున్సిపాల్టీల్లో బీజీపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. కొందరు ముఖ్య నేతలు, కేడర్ ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు ఎక్కువ చోట్ల గెలిచే చాన్స్​ఇవ్వకుండా ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఆ రెండు పార్టీల్లో స్థానికంగా బలమైన నాయకులపై వల విసిరే ఆలోచనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వెలుగు వార్తలకు క్లిక్ చేయండి