మురళీయాదవ్ ను​  సస్పెండ్​చేసిన టీఆర్ఎస్

మురళీయాదవ్ ను​  సస్పెండ్​చేసిన టీఆర్ఎస్
  •     ప్రెస్​మీట్​పెట్టి  కేసీఆర్​ను విమర్శించిన మురళీయాదవ్​​ 
  •     వెంటనే పార్టీ నుంచి సస్పెండ్​చేసిన  హైకమాండ్​ 
  •     ఇప్పటికే చిలప్ చెడ్ జడ్పీటీసీ శేషసాయిరెడ్డి రాజీనామా

మెదక్/ నర్సాపూర్​, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల తీరుపై ద్వితీయశ్రేణి నాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కొందరు స్వయంగా రాజీనామా చేస్తుండగా, గీతదాటిన వారిని పార్టీ హైకమాండ్​సస్పెండ్​చేస్తోంది.  ఇలా బలమైన నాయకులు ఒక్కొక్కరూ  టీఆర్ఎస్​పార్టీకి దూరమవుతుండడం రాజకీయ వర్గాల్గో  చర్చనీయాంశంగా మారింది.

గతంలో కాంగ్రెస్​కు కంచుకోటగా ఉన్న నర్సాపూర్​ నియోజకవర్గంలో  తెలంగాణ రాష్ట్రం వచ్చినంక టీఆర్ఎస్​ పాగా వేసింది.  2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్​అభ్యర్థి చిలుముల మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నర్సాపూర్​కు చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్​పార్టీ అధ్యక్షుడు ఎర్రగొళ్ల మురళీ యాదవ్​ నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు. ఆయన భార్య రాజమణి నర్సాపూర్​ జడ్పీటీసీ గా గెలుపొంది ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్​పర్సన్​గా పనిచేశారు.  

సునీతారెడ్డి రాకతో.. 

నర్సాపూర్ ​నియోజకవర్గానికే  చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 2019లో కాంగ్రెస్​ పార్టీకి గుడ్​బై చెప్పి టీఆర్ఎస్​  లో జాయిన్​ అయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డిది ఒక వర్గం, సునీతారెడ్డిది ఒక వర్గంగా కొనసాగుతుండగా, మరోవైపు మురళీ యాదవ్ తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

కేసీఆర్​ మాటిచ్చినా​.. 

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మురళీయాదవ్​ నర్సాపూర్​ అసెంబ్లీ  టీఆర్ఎస్​టికెట్ ​ఆశించారు. కానీ  సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్​ రెడ్డికే చాన్స్​ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్.. ఎన్నికల ప్రచార సభలో మురళీ యాదవ్ కు తగిన ప్రాధాన్యమిస్తామని  ప్రకటించారు. దీంతో ఆయన ఎన్నికల్లో మదన్​రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. అయితే మురళీ యాదవ్​ కు నర్సాపూర్​ మున్సిపల్​ చైర్మన్​ పదవి మాత్రమే దక్కింది. కాంగ్రెస్​ పార్టీ నుంచి వచ్చిన సునీతారెడ్డికి కేబినెట్​హోదా గల మహిళా కమిషన్​​ చైర్ ​పర్సన్​ పదవి ఇవ్వడంతో పాటు, హత్నూర మండలానికి చెందిన ఉమ్మన్నగారి దేవేందర్​ రెడ్డికి  లేబర్ వెల్ఫేర్​ కమిషన్ చైర్మన్​ పదవి  ఇచ్చారు.  ఎమ్మెల్యే స్థాయి గల తనను మున్సిపాలిటీకి పరిమితం చేసి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి  రాష్ట్ర స్థాయి నామినేటెడ్​పదువులు ఇవ్వడంతో మురళీ యాదవ్​  అసంతృప్తితో ఉన్నారు.  గతేడాదే పార్టీ మారుతారనే ప్రచారం జరిగినా.. టీఆర్ఎస్​ పెద్దల బుజ్జగింపుతో ఆగిపోయారు.  ఇప్పుడు అనూహ్యంగా ప్రెస్​మీట్​పెట్టి పార్టీ హైకమాండ్​పై , పరోక్షంగా సీఎం కేసీఆర్​పై​తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తిస్తలేరని, అగ్రవర్ణాల వారికి నామినేటెడ్​పదవులు ఇస్తూ.. బీసీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంతకు ముందు పార్టీ తీరు, ఎమ్మెల్యే వ్యవహారశైలి నచ్చక చిలప్ చెడ్  జడ్పీటీసీ శేషసాయి రెడ్డి  పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ ఏకంగా పార్టీ హైకమాండ్​పైనే ఫైర్​అయ్యారు.  దీంతో మురళిని పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్టు టీఆర్​ఎస్​ జిల్లా ప్రెసిడెంట్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి ప్రకటించారు. 

మురళీ యాదవ్​ ఏ పార్టీలోకి.. 

టీఆర్ఎస్​ పార్టీ హైకమాండ్​మురళీ యాదవ్ ను సస్పెండ్ చేయడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు..? అనే చర్చ మొదలైంది.  బీజేపీలోకే వెళతారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులతోపాటు,  మురళీ యాదవ్ బీజేపీలో చేరనున్నట్టు ఆ పార్టీ చేరికల కమిటీ ఇన్​చార్జి  ఈటల రాజేందర్​ ఇటీవల చెప్పడం గమనార్హం.