హుజూర్ నగర్ బైపోల్.. టీఆర్​ఎస్​లో కలవరం

హుజూర్ నగర్ బైపోల్.. టీఆర్​ఎస్​లో కలవరం
    • గట్టెక్కేందుకు ఇతర పార్టీల వైపు చూపు
    • సీపీఐని కలిసి సపోర్టు కోరిన టీఆర్ ఎస్​ సీనియర్లు
    • రెండురోజుల్లో నిర్ణయం చెబుతామన్న సీపీఐ
    • సర్పం చ్ లను బుజ్జగించే పనిలో మంత్రులు
    • అభ్యర్థులను ప్రకటిం చిన టీడీపీ, సీపీఎం

హైదరాబాద్‌, వెలుగుహుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పరీక్షగా మారింది. నియోజకవర్గంలో కాంగ్రెస్​ బలంగా ఉండటం.. సర్పంచ్​ల తిరుగుబాటు.. గతంలో అండగా నిలిచిన అనేక కులాలు ఇప్పుడు బాహాటంగానే కోపం ప్రదర్శిస్తుండటంతో ఈ ఎన్నిక అంత ఈజీ కాదనే అంచనాకు గులాబీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. సొంత బలం, సొంత బలగాన్నే నమ్ముకుంటే ఫాయిదా లేదని లెక్కలేసుకొని ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి ఎన్నికలో టీఆర్​ఎస్ ఒంటరిగానే  పోటీ చేసింది. హుజూర్‌ నగర్‌  విషయంలో మాత్రం ఇతర పార్టీల సపోర్ట్​ కోరుతోంది. తిరుగుబాటుకు సిద్ధమైన సర్పంచ్​లను బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే  టీఆర్​ఎస్​ను ఉప ఎన్నిక ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీపీఐతో మద్దతు కోసం ఢిల్లీ స్థాయిలో టీఆర్​ఎస్​ పెద్దలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ వెంట ఉన్న టీడీపీ.. ఇప్పుడు హుజూర్​నగర్​  బరిలో దిగడం కూడా చర్చనీయాంశమైంది.

కేంద్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌‌‌‌ను ప్రకటించగానే అదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని టీఆర్​ఎస్​ క్యాండిడేట్‌‌‌‌గా ప్రకటించింది. అలా అభ్యర్థిని ముందుగా ప్రకటించి ఎన్నికల రేసులో ముందున్న అధికార పార్టీ నేతలు గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. తీరా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యే  టైమ్​కు ఇంటలిజెన్స్‌‌‌‌, ఇతర వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో సీన్​ మారిపోయినట్లు సమాచారం. నియోజకవర్గంలో కాంగ్రెస్​ బలంగా ఉందని, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఇంటలిజెన్స్​ వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌కు ముందే నియోజకవర్గంలోని రైతులందరికీ రైతుబంధు మొత్తాన్ని వారి వారి అకౌంట్లలో వేసినా ప్రజల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. ముందుగా పంట రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించాలని, ప్రభుత్వం విడతల వారీగా ఆ మొత్తాన్ని ఇస్తుందని సీఎం ప్రకటించడం కూడా రైతుల్లో అసంతృప్తికి కారణమైనట్లు ఇంటలిజెన్స్​ వర్గాలు తమ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. ఆసరా పింఛన్లను పెంచినా, పింఛన్​ వయస్సు తగ్గింపు హామీ ఎప్పటికి అమలవుతుందో తెలియకపోవడం వంటి అంశాలు కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. వీటిని అధిగమించాలంటే ఇతర పార్టీల మద్దతు తప్పదని, అసంతృప్త నేతలను బుజ్జగించాలనే నిర్ణయానికి టీఆర్​ఎస్​ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీకాంతాచారి తల్లిని అర్జెంట్​గా పిలిపించుకొని నామినేటెడ్‌‌‌‌ పోస్టు ఇస్తామంటూ హామీ ఇచ్చి ఆమె పార్టీ మారకుండా జాగ్రత్త పడ్డట్లు సమాచారం.

కూటమి పార్టీలపై ఫోకస్​

అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌‌‌‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌‌‌‌ కలిసి ప్రజాకూటమిగా పోటీ చేశాయి. హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని ఉత్తమ్‌‌‌‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌‌‌‌. రమణకు ఫోన్‌‌‌‌ చేసి అడిగారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌‌‌‌రెడ్డిని, టీజేఎస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ కోదండరాంను స్వయంగా కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని ఈ నేతలు ఉత్తమ్‌‌‌‌కు చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌కు స్థానికంగా ఉన్న బలానికి కూటమి పార్టీలు కూడా తోడైతే సమస్యేనని భావించిన టీఆర్​ఎస్​.. కూటమిలోని పార్టీలతో టచ్​లోకి వచ్చింది. ఈ క్రమంలో సీపీఐ నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని టీఆర్​ఎస్​ నేతలు కోరారు. ఇప్పటికే సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో కేసీఆర్‌‌‌‌ ఫోన్‌‌‌‌లో మాట్లాడినట్టు సమాచారం. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు మద్దతుపై సీపీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో లెఫ్ట్​ పార్టీలను తోక పార్టీలంటూ మాట్లాడిన కేసీఆరే స్వయంగా సీపీఐ కేంద్ర కార్యదర్శితో మాట్లాడటం, తమ పార్టీ సెక్రటరీ జనరల్‌‌‌‌తోపాటు ఇతర నేతలు సీపీఐ ఆఫీస్‌‌‌‌కు పంపడం.. అధికార పార్టీని ఉప ఎన్నిక ఎంతగా కలవరపెడుతుందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ముందుకు వెళ్లిన టీడీపీ.. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతిచ్చి పోటీకి నిలువలేదు. కానీ.. ఇప్పుడు ఉప ఎన్నికలో మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇలా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం వెనుక కూడా కొందరు టీఆర్​ఎస్​ నేతలు మంత్రాంగం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. కూటమిలో మిగిలిన పార్టీ టీజేఎస్‌‌‌‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఐక్యంగా కాంగ్రెస్‌‌‌‌ నేతలు

ఉప్పు నిప్పులా ఉండే రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ నేతలను హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉప ఎన్నిక ఏకం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలే కాదు.. రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ నేతలు కూడా విభేదాలను వీడి ఐక్యంగా పనిచేస్తున్నారు. మొన్నటివరకు అభ్యర్థి ఎన్నికపై విభేదాలు కనిపించినప్పటికీ ఇప్పుడు వారంతా ఒక్కటయ్యారని కాంగ్రెస్​ సీనియర్​ నేత ఒకరు తెలిపారు. గెలుస్తామనే నమ్మకంతోనే వీరంతా ఒక్కటైనట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి పీసీసీ చీఫ్‌‌‌‌ భార్య కావడంతో ఇక్కడ గెలుపును ఆయనతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌‌‌‌ను వీడి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిన నేతలను ఒక్కరొక్కరిగా వెనక్కి రప్పించుకుంటున్నారు.

సర్పంచ్ల పంచ్

సర్పంచ్​ల తిరుగుబాటు అధికార పార్టీని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. రాష్ట్ర సర్పంచ్​ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్​ నామినేషన్‌‌‌‌ వేసేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించడం స్థానిక ప్రజాప్రతినిధుల్లో వ్యతిరేకతను ఇంకింత పెంచింది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము నామినేషన్లు వేసి తీరుతామంటూ సర్పంచ్​లు హెచ్చరిస్తున్నారు. వాళ్లు అంతటితోనే ఆగకుండా హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లోని సర్పంచ్​లను కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటుకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్బంధాలతో ఆగ్రహంతో ఉన్న సర్పంచ్​లంతా ఏకమైతే తమ గెలుపు సాధ్యం కాదనే అంచనాకు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వచ్చినట్టు తెలుస్తోంది. వారిని ఎలాగైనా దారికి తెచ్చుకునేందుకు కొందరు మంత్రులు రంగంలోకి దిగి బుజ్జగింపు చర్యలకు దిగినట్లు సమాచారం.