పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న టీఆర్ఎస్

పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న టీఆర్ఎస్
  •  పోలీసుల ద్వారా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు
  • దీక్షలు, నిరసనలు చేయకుండా అడ్డగింతలు, అరెస్టులు
  • ప్రభుత్వ కార్యక్రమాలు, టీఆర్ఎస్ సంబురాలకు బందోబస్తులు
  • స్టేషన్లలో కంటే బయటి డ్యూటీల్లోనే ఎక్కువ

నెట్‌‌వర్క్, వెలుగు: ప్రజల రక్షణ కోసం పని చేయాల్సిన పోలీసు వ్యవస్థను.. తమ రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంటోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యల కోసం ఉపయోగించుకోవడం ఈ మధ్య ఎక్కువైంది. గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణచివేసేందుకు, ప్రతిపక్ష నేతలను కట్టడి చేసేందుకు, సీఎం, మంత్రుల పర్యటనల సందర్భంగా జిల్లాల్లో ముందస్తు అరెస్టుల కోసం పోలీసులను మోహరిస్తున్నారు. దీంతో స్టేషన్లలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఖాకీలు తరచూ రోడ్లపైనో, ప్రతిపక్ష నేతల ఇండ్ల దగ్గరో కనిపిస్తున్నారు. ఫలితంగా కేసుల ఇన్వెస్టిగేషన్‌‌లో, ప్రాపర్టీ రికవరీలో, క్రైం రేట్​తగ్గింపులో  వెనుకబడుతున్నామని పోలీసులే అంటున్నారు. డిపార్ట్‌‌మెంట్‌‌లో ఇప్పటికే సుమారు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తమపై పని భారం పెరుగుతోందని, కనీసం వీక్లీ ఆఫ్‌‌లు కూడా తీసుకోలేకపోతున్నామని వాపోతున్నారు.

ప్రతిపక్షాలను అడ్డుకోవడమే లక్ష్యంగా..

ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు.. రోడ్లపైనో, పబ్లిక్​ ప్లేసుల్లోనో, ప్రభుత్వ ఆఫీసుల ముందో ఆందోళన చేస్తే ముందు జాగ్రత్తగా పోలీసులను రంగంలోకి దించుతారు. కానీ ప్రతిపక్ష నేతల దీక్షలను, శాంతియుత కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులను సర్కారు వాడుకుంటోంది. గత నెల ​27న బీజేపీ హైదరాబాద్‌‌లోని తన పార్టీ ఆఫీసులో నిరుద్యోగ దీక్షకు, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కాంగ్రెస్​ రచ్చబండకు పిలుపునిచ్చాయి. నిరుద్యోగులు, రైతుల సమస్యలపై చర్చించేందుకు చేపట్టిన కార్యక్రమాలే తప్ప ఆందోళనలో, ధర్నాలో కావు. కానీ వీటిని సైతం అడ్డుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు ఎక్కడ లేని ఉత్సాహం చూపింది. 

ఊరూరా పోలీసులను రంగంలోకి దించి, ప్రతిపక్ష లీడర్లను హౌస్​అరెస్ట్​చేసింది. కింది స్థాయి నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంది. రచ్చబండ కార్యక్రమం కోసం రేవంత్​రెడ్డి వస్తే అడ్డుకునేందుకు ఒక్క ఎర్రవెల్లిలోనే సీపీ, నలుగురు ఏసీపీలు, సీఐలు, ఎస్​ఐలు కలిపి 200 మంది దాకా పోలీసులను మోహరించారు. 317 జీవోను సవరించాలనే డిమాండ్​తో ఈ నెల 2న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్​లో చేపట్టిన జాగరణ దీక్షను భగ్నం చేసేందుకు ఏకంగా కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది పోలీసులను రంగంలోకి దించారు. హైదరాబాద్‌‌‌‌లోనే కాదు, జిల్లాల్లో, మండలాల్లో అపొజిషన్​పార్టీలు ఎక్కడ, ఏ ప్రోగ్రామ్​కు పిలుపునిచ్చినా, సీఎం, మంత్రుల టూర్లు ఉన్నా పోలీసులు ఉదయమే అక్కడి లోకల్ లీడర్ల ఇండ్లకు వెళ్లి ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్ట్ చేసి ఇద్దరు, ముగ్గురు పోలీసులను రోజంతా అక్కడే కాపలా పెడ్తున్నారు. ఇదే టైంలో అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దగ్గరుండి బందోబస్తు కల్పిస్తున్నారు. ఇటీవల యాంసగి వడ్ల కొనుగోళ్లలో కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను, తాజాగా జరుగుతున్న రైతుబంధు సంబురాలను పోలీసులే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

వందల మంది అరెస్టులు

ప్రభుత్వానికి, టీఆర్ఎస్ లీడర్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడ్తున్నారని, వార్తలు రాస్తున్నారని గత ఏడాది కాలంలో వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిపై కేసులు పెట్టి జైళ్లకు పంపారు. ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా 43 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఇక ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే పోలీసులను టీఆర్ఎస్ కండువా లేని కార్యకర్తల్లా వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీస్​స్టేషన్లలో రైటర్లు తప్ప ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. దీంతో వివిధ సమస్యలతో స్టేషన్లకు వచ్చే బాధితులకు రోజుల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్న చిన్న కేసులు ఫైల్​ చేసేందుకు, ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌లు రాసేందుకు వారాలకు వారాలు పడుతోందని జనం వాపోతున్నారు.

కేసులన్నీ పెండింగ్‌‌‌‌లో..

రాష్ట్రంలో సుమారు 23 వేలకు పైగా కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 19,143 కానిస్టేబుల్, 413 ఎస్‌‌‌‌ఐ పోస్టుల భర్తీ కోసం పోలీస్ శాఖ సర్కారుకు 2020 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే ప్రపోజల్స్ పంపింది. కానీ ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కనీసం వీక్లీ ఆఫ్​కూడా లేకుండా పనిచేస్తున్నారు. ఖాళీలు భర్తీ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన సర్కారే.. తమను పొలిటికల్ అవసరాల కోసం వాడుతుండడంతో కేసులు పెండింగ్‌‌‌‌లో పడిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో బాధితులంతా నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని, కానీ సర్కారు చెప్పే అదనపు పనుల ఒత్తిడి వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని అంటున్నారు. ప్రజల్లో తాము చులకన​అవుతున్నామని వాపోతున్నారు. ఇటీవల కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో బండి సంజయ్​ను అరెస్ట్​చేసిన ఘటనలో సీపీ సత్యనారాయణపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సర్కారు తమ డ్యూటీ తమను చేసుకోనిస్తే ఇలా అందరితో మాటలు పడాల్సిన అవసరం వచ్చేది కాదని అంటున్నారు.

పెరిగిన క్రైమ్ రేట్

2020లో -దొంగతనాలు, దోపిడీలు 12,141 జరగ్గా.. 2021లో 17,344కి పెరిగాయి. అంటే ఏడాదిలో 43 శాతం పెరిగాయి. హత్యలు 606 నుంచి 838(38శాతం)కి, అత్యాచారాలు 1,934 నుంచి 2,382(23 శాతం )కి, కిడ్నాప్స్ 1,033 నుంచి 1,218 (17 శాతం)కి, మిస్సింగ్స్ 14,698 నుంచి 16,956(15 శాతం)కి పెరిగాయని, ఓవరాల్ క్రైమ్ రేట్​కూడా 4.65 శాతం పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. గతేడాది17,429 కేసుల్లో రూ.113.5 కోట్లు ప్రాపర్టీని జనం కోల్పోయారని, 7,682 కేసుల్లో రూ.53.52 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగామని అంటున్నారు. సైబర్​క్రైమ్స్‌‌‌‌కు సంబంధించి ప్రజలు రూ.95.72 కోట్లను కోల్పోగా, కేవలం రూ.5.12 కోట్లను మాత్రమే రికవరీ చేశామని చెబుతున్నారు.

జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్ కామెంట్లకు నిరసనగా ఈ నెల 6న బీజేవైఎం నేతలు ఆందోళన చేయబోతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మంచిర్యాలలో ఎస్సై కిరణ్​, కానిస్టేబుళ్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణను ఉదయం 10 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. తాము ఎలాంటి ఆందోళన చేయడం లేదని, ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్తున్నా బలవంతంగా గుంజుకెళ్లారు. ‘‘సర్.. పాప ఏడుస్తోంది. ఇంట్లో వాళ్లు భయపడుతున్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేవు” అని బతిమిలాడినా పట్టించుకోలేదు. మంచిర్యాల నుంచి హాజీపూర్ పోలీస్​స్టేషన్​కు తరలించి ఆరు గంటలు నిర్బంధించారు. వెంకటకృష్ణ ఫ్యామిలీ మెంబర్లు, బీజేపీ లీడర్లు మంచిర్యాల సీఐకి, ఏసీపీకి, రామగుండం సీపీ ఆఫీస్‌‌‌‌కి ఫోన్ చేయడంతో సాయంత్రం 4 గంటలకు ఆయనను రిలీజ్​చేశారు.

మూడేండ్లయినా యువతి మర్డర్ మిస్టరీ వీడలే

2019 జులై 7న జగిత్యాల జిల్లా కొండగట్టులో బొజ్జ పోతన్న గుట్ట దగ్గర్లోని కందకంలో ఒక యువతి డెడ్​బాడీ కనిపించింది. పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేసుకుని, ఎంక్వైరీ చేపట్టారు. మృతురాలి మెడ మీద గాట్లు ఉండటంతో హత్యగా తేల్చారు. డాగ్ స్క్వాడ్‌‌‌‌ను రప్పించి, ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు ఆమెను రేప్ చేశారని, ఆమె మూడు నెలల గర్భిణి అని పోస్ట్‌‌‌‌మార్టం రిపోర్టులో తేలింది. కానీ చనిపోయిందెవరో, హత్య చేసిందెవరో ఇప్పటిదాకా తెలుసుకోలేదు.