కన్వరియాల బస్సును ఢీకొన్న ట్రక్కు.. జార్ఖండ్‌‌లో ఆరుగురు శివ భక్తులు మృతి

కన్వరియాల బస్సును ఢీకొన్న ట్రక్కు.. జార్ఖండ్‌‌లో ఆరుగురు శివ భక్తులు మృతి

రాంచీ: జార్ఖండ్‌‌లోని దేవఘర్ జిల్లాలో మంగళవారం (జులై 29) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా దేవఘర్ నుంచి బసుకినాథ్‌‌కు వెళ్తున్న కన్వరియాల(శివ భక్తులు) బస్సును గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కన్వరియాలు మరణించారని..మరో 29 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. 

గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల సంఖ్య  పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 32 సీట్లు ఉన్న బస్సులో 40 మందికి పైగానే కన్వరియాలు దేవఘర్ నుంచి బసుకినాథ్‌‌లోని శివాలయానికి బయలుదేరారని తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకు మోహన్‌‌పూర్ ఏరియాలోని జమునియా అటవీ ప్రాంతానికి  చేరుకోగా..అక్కడ సిలిండర్లతో కూడిన ట్రక్కు రాంగ్ రూటులో వేగంగా రావడంతో ప్రమాదం జరిగిందని వివరించారు. 

ట్రక్కు ఢీకొన్న తర్వాత బస్సు డ్రైవర్ బయటకు పడిపోయాడని.. దీంతో డ్రైవర్ లేకుండానే బస్సు కొంత దూరం ప్రయాణించి ఓ స్తూపాన్ని ఢీకొని ఆగిపోయిందన్నారు. ఘటనలో ఆరుగురు మృతి చెందగా..29 మంది గాయపడ్డారని,  బస్సు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. గాయపడినవారిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రులకు తరలించామన్నారు. అలాగే మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు పంపినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని దేవఘర్ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా ధ్రువీకరించారు. కానీ ఆయన..ఈ దుర్ఘటనలో 18 మంది కన్వరియాలు మరణించినట్లు ప్రకటించారు. 

ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

జార్ఖండ్‌‌లోని దేవఘర్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు. గాయపడినవారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందిస్తూ..బస్సులో ప్రమాదంలో గాయపడినవారికి నాణ్యమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.