
- అక్టోబర్ 1 నుంచే అమలు చేస్తామని వెల్లడి
- బ్రాండెడ్, పేటెంట్ డ్రగ్స్పై 100 శాతం టారిఫ్
- జెనరిక్ మెడిసిన్స్కు సుంకాల నుంచి మినహాయింపు
- ఇండియాపై ప్రభావం పరిమితమే అంటున్న నిపుణులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. తమ దేశంలోకి దిగుమతయ్యే ఫార్మాస్యూటికల్ డ్రగ్స్పై 100 శాతం టారిఫ్ విధించారు. అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ డ్రగ్స్పై 100 శాతం టారిఫ్ అమలవుతుందని, జెనరిక్ మెడిసిన్స్కు టారిఫ్ వర్తించదని వెల్లడించారు. దీంతో పాటు కిచెన్ క్యాబినెట్స్, ఫర్నీచర్, ట్రక్కులపైనా సుంకాలు విధించారు. కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ పరికరాలపై 50 శాతం, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నీచర్‌పై 30 శాతం, హెవీ ట్రక్కులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు తన ట్రూత్ సోషల్ అకౌంట్లో ట్రంప్ వెల్లడించారు.
నేషనల్ సెక్యూరిటీ, అమెరికన్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌ను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఫార్మా కంపెనీలను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. అమెరికాలో తయారీ యూనిట్ల నిర్మాణం ప్రారంభించిన విదేశీ మందుల కంపెనీలకు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. ‘అమెరికా ఫస్ట్’ పాలసీకి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
మల్టీ నేషనల్ కంపెనీలపై ప్రభావం
దిగుమతుల కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోతున్న రంగాలపై సుంకాల విధింపు కొనసాగుతూనే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. చాలా దేశాలు తమ దేశాన్ని దోచుకున్నాయని విమర్శించారు. ఇప్పుడు ఆ సొమ్మును తిరిగి రాబట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించుకోవడంలో టారిఫ్‌లు సహాయపడుతాయని వివరించారు. ఫ్యూచర్లో ఈ టారిఫ్‌లు 150% నుంచి 250% వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, ట్రంప్ విధించిన 100% టారిఫ్.. బ్రాండెడ్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసే మల్టీనేషనల్ కంపెనీలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
ఇండియాపై ప్రభావం పరిమితమే!
జెనరిక్ ఔషధాల ఎగుమతుల్లో ఇండియాదే తొలి స్థానం. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే మందులలో సగానికి పైగా జెనరిక్‌లే ఉన్నాయి. ట్రంప్ జెనరిక్ మందులకు మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో మన దేశంపై టారిఫ్‌ల ప్రభావం పరిమితమేనని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్(ఐపీఏ) అభిప్రాయపడింది.
అమెరికాకు అవసరమయ్యే 47% ఔషధ అవసరాలను ఇండియన్ కంపెనీలే తీరుస్తున్నాయి. ఇండియా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాల వల్ల ఒక్క 2022లోనే 219 బిలియన్ డాలర్ల మేర ఆదా చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. 2013 నుంచి 2022 వరకు చూస్తే ఈ మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల మేర ఉంటుందని పేర్కొన్నాయి.