దెబ్బ మీద దెబ్బ.. H-1B వీసాపై ట్రంప్ మరో కీలక నిర్ణయం..?

దెబ్బ మీద దెబ్బ.. H-1B వీసాపై ట్రంప్ మరో కీలక నిర్ణయం..?

H-1B వీసాపై మరో కీలక నిర్ణయం దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్.. H-1B వీసాలపై లాటరీ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. పాత లాటరీ విధానాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో శాలరీ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ను తీసుకురావాలని అమెరికా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

H-1B వీసాలపై ఈ విధానం అమల్లోకి వస్తే.. ఎక్కువ వేతనాలు పొందే అవకాశం ఉన్న ఉద్యోగులకు లాటరీలో హెచ్1-బీ వీసా పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తక్కువ జీతాలు ఉన్నవారికి ఒకే ఒక్క ఛాన్స్ ఉంటుంది. అధిక నైపుణ్యం కలిగిన వారితో పాటు ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులకు మాత్రమే ఈ ‘వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్’ అనుకూలంగా ఉంటుంది. అయితే.. అదే సమయంలో అన్ని వేతన స్థాయిల్లో కొనసాగుతున్న ఉద్యోగులు కూడా H-1B వీసా పొందే అవకాశం కంపెనీలకు ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.

మొత్తం నాలుగు వేతన స్థాయిల్లో H-1B వీసాకు ఎంపిక చేస్తారు. వార్షిక వేతనం లక్షా 62 వేల 528 డాలర్లు పొందుతున్న ఉద్యోగులకు నాలుగు ఎంట్రీలు ఉంటాయి. అందువల్ల.. ఈ ఉద్యోగులకు H-1B వీసా పొందే అవకాశాలను పెంచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 70 వేల డాలర్ల లోపు ఉన్న ఉద్యోగులకు కేవలం ఒక్క అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ విధానం వల్ల ఎక్కువ నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకునే అవకాశం స్టార్టప్ కంపెనీల కంటే పెద్ద కంపెనీలకు ఎక్కువ ఉంటుంది.

స్టార్టప్ కంపెనీలకు ఇది ప్రతికూల అంశమేనని చెప్పక తప్పదు. ఈ విధానం అమల్లోకి వస్తే నైపుణ్యం కలిగిన అమెరికన్లు అధిక వేతనాలు పొందే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతోనే ఈ విధానం వైపు ట్రంప్ అడుగులేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే.. కొత్త లాటరీ విధానం అమల్లోకి వస్తే ఈ మధ్య చదువు పూర్తి చేసుకున్న ఇండియన్ స్టూడెంట్స్కు, యూఎస్లో ఇటీవల ఉద్యోగం పొంది 70 వేల డాలర్ల లోపు వార్షిక వేతనం పొందుతున్న విదేశీ ఉద్యోగులకు గడ్డు కాలమే.