
- ప్రతిపాదనలను రెడీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హెచ్1బీ వీసాలపై ప్రస్తుతం ఉన్న లాటరీ సిస్టమ్‌ను తొలగించేందుకు యోచిస్తోంది. ఈ మేరకు ట్రంప్ పరిపాలన విభాగం ప్రపోజల్స్‌ను తీసుకొచ్చింది. ఈ లాటరీ సిస్టమ్‌ను రద్దు చేసి, వేటెడ్ లేదా వేజ్ బేస్డ్ పద్ధతికి మార్చాలని ప్రతిపాదించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) వేటెడ్ సెలక్షన్ ప్రాసెస్ (శాలరీ లేదా క్వాలిఫికేషన్ ఆధారంగా)ను ప్రతిపాదించింది.
ఈ క్రమంలో అధిక నైపుణ్యం లేదా అధిక జీతం పొందే వీదేశీయులకు హెచ్1బీ వీసాలను ఇవ్వడమే దీని లక్ష్యంగా తెలుస్తోంది. దీని ప్రకారం, వార్షిక జీతం 1.62 లక్షల డాలర్లు అందుకుంటున్న వారు నాలుగు ఎంట్రీలు కలిగి ఉంటారు. ఫ్రెషర్స్‌కు ఒక ఎంట్రీ మాత్రమే ఉంటుంది. దీంతో అనుభవం ఉన్న ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలు దీని ద్వారా కల్పించనున్నారు.
ప్రిన్సిపల్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నికోల్ గుణారా మాట్లాడుతూ, కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రపంచ ప్రతిభ అమెరికా ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగలదని పేర్కొన్నారు. మెటాలో వార్షికంగా 1.50 లక్షల డాలర్ల వేతనం తీసుకునే ఇంజినీర్‌కు కొత్త రూల్స్ ప్రకారం చాలా అవకాశాలు ఉంటాయన్నారు. వార్షికంగా 70 వేల డాలర్లు తీసుకునే డెవలపర్‌కు తక్కువ చాన్స్‌లు ఉంటాయని తెలిపారు.