
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ కలిశారు. ఇటీవలే హత్యకు గురైన కన్జర్వేటివ్ ఇన్‌ప్లుయెన్సర్ చార్లీ కిర్క్ (31) అంత్యక్రియల్లో ట్రంప్, మస్క్ కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆదివారం ఆరిజోనా స్టేట్ గ్లెన్ డేల్ సిటీలోని స్టేట్ ఫాం స్టేడియంలో చార్లీ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. చార్లీని కడసారి చూసి నివాళి అర్పించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ట్రంప్, మస్క్ కూడా చార్లీకి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత ఇద్దరూ పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నారు. వారిద్దరూ మాట్లాడుకుంటున్న ఫొటోను వైట్ హౌస్ అధికారులు రిలీజ్ చేశారు. ట్రంప్, మస్క్ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా క్షీణించాయి. ట్యాక్స్ బిల్లుపై ట్రంప్ సంతకం చేయడం, ఆ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ మాట్లాడడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. తాను సపోర్ట్ చేయకపోయుంటే, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచేవారు కాదని మస్క్ విమర్శించారు. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కూడా వారి మాటల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసింది. అమెరికన్ పార్టీని పెట్టిన తర్వాత మస్క్ మాట్లాడుతూ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌ను బట్టబయలు చేయడమే తన పార్టీ ప్రధాన ఉద్దేశమని ఓ కార్యక్రమంలో మస్క్ ప్రకటించారు. తాజాగా చార్లీ అంత్యక్రియల్లో ఇద్దరూ మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.