మెక్సికో, ఈయూపై 30 శాతం టారిఫ్ లు... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన

మెక్సికో, ఈయూపై 30 శాతం టారిఫ్ లు... అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ప్రకటన

న్యూజెర్సీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  మరోమారు టారిఫ్ ల లేఖలు పంపారు.. ఈసారి తమ దేశానికి అతిపెద్ద వ్యాపార భాగస్వాములైన మెక్సికో, యురోపియన్ యూనియన్ దేశాలకు 30 శాతం టారిఫ్ లు విధించారు. ఈమేరకు శనివారం ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో టారిఫ్ ల లేఖలు పోస్ట్ చేశారు. ఆగస్టు 1 నుంచి సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. మెక్సికో, ఈయూ ప్రెసిడెంట్లకు టారిఫ్  లేఖలు పంపినట్లు తెలిపారు. అక్రమ చొరబాట్లు, ఫెంటానిల్ డ్రగ్ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు మెక్సికో తనకు సాయం చేసిందని ట్రంప్ చెప్పారు. 

అయితే, అది సరిపోలేదని, సరిహద్దులను సంరక్షించడంలో సాయపడినా.. నార్త్​ అమెరికా నార్కో ట్రాఫికింగ్  ప్లేగ్రౌండ్ గా మారకుండా మెక్సికో అడ్డుకోలేకపోయిందని చెప్పారు. మెక్సికో ప్రెసిడెంట్  క్లాడియా షీన్ బామ్  పార్డోకు రాసిన లేఖలో ట్రంప్  ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక అమెరికా లోటు వాణిజ్యం జాతీయ భద్రతా ముప్పుగా మారిందని ఈయూ ప్రెసిడెంట్  ఉర్సులా వాండెర్  లెయెన్ కు రాసిన లేఖలో ట్రంప్  తెలిపారు. ‘‘యూరోపియన్  యూనియన్ తో ట్రేడింగ్  రిలేషన్స్ పై కొన్నేండ్ల పాటు చర్చలు జరిపాం. అలాగే దీర్ఘకాలిక వాణిజ్య లోటు, అమెరికాపై మీరు (ఈయూ) వేస్తున్న టారిఫ్ లు, అనుసరిస్తున్న విధానాలు, వాణిజ్య అడ్డంకుల నుంచి బయటపడడంపైనా చర్చించాం. 

కానీ, దురదృష్టవశాత్తు ఈయూ, అమెరికా మధ్య సంబంధాలు ఆశించినంత మెరుగ్గా లేవు’’ అని ట్రంప్  పేర్కొన్నారు. కాగా.. తాజా లెటర్లతో మొత్తం 24 దేశాలు, ఈయూ (27 దేశాల) కు ట్రంప్​ టారిఫ్ లేఖలు పంపినట్లైంది. త్వరలో మరికొన్ని దేశాలకూ ఆయన టారిఫ్  లెటర్లు పంపే అవకాశం ఉంది. మరోవైపు అమెరికాకు ఎగుమతి చేసే సరుకులపై అధిక టారిఫ్ లను తప్పించడానికి త్వరలో ట్రేడ్  డీల్  కుదుర్చుకుంటామని ఈయూ తెలిపింది.