ఇండియాతో రాజీ కోసం ట్రంప్ తహతహ.. వరుస పోస్టులతో పరోక్ష సందేశం.. చివరికి ఏం చేశారంటే..

ఇండియాతో రాజీ కోసం ట్రంప్ తహతహ.. వరుస పోస్టులతో పరోక్ష సందేశం.. చివరికి ఏం చేశారంటే..

యూరప్, ఆసియాలోని కొన్ని దేశాలను భయపెట్టి అమెరికా ఉత్పత్తులను అమ్ముకోవాలని చూసిన ట్రంప్.. ఆ విషయంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారు. అదే గర్వంతో భారత్ ను కూడా టారిఫ్స్, సాంక్షన్స్ పేరున బెదిరించి లబ్దిపొందాలనుకున్న పాచిక పారలేదు. అమెరికా సుంకాలకు భారత్ ఒప్పుకోక పోయేసరికి.. డబుల్ టారిఫ్ లు విధిస్తామని బెదిరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు ట్రంప్. ఇదే సమయంలో ఇండియా వేసిన ఎత్తుగడకు దిమ్మ తిరిగి మళ్లీ రాజీ బేరానికి వస్తున్నారు. అందుకోసం స్నేహపూరిత సందేశాలను పంపుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

అమెరికా అహంకార పూరిత విధానాలకు విసుగు చెందిన భారత్.. అటు రష్యా, చైనాకు దగ్గరయ్యేలా కనిపించింది. చైనాలో జరిగిన సమ్మిట్ లో మూడు దేశాధి నేతల స్నేహపూరిత వైఖరి అమెరికాలో గుబులు రేపింది. వాణిజ్యం, సంబంధాల విషయంలో మరింత అనుకూల ధోరణితో ముందుకెళ్దామని చైనా, రష్యా, ఇండియా నిర్ణయించాయి. దీంతో భారత్ అమెరికాకు దూరం అవుతోందని ప్రసిడెంట్ ట్రంప్ పై బహిరంగ విమర్శలు వచ్చాయి. 

సొంత పార్టీ నేతలు కూడా ట్రంప్ పై విమర్శలకు దిగారు. ట్రంప్ వైఖరి కారణంగానే ఏళ్లు తరబడి కొనసాగుతున్న ఇండియా-యూఎస్ సంబంధాలు దెబ్బతినేలా ఉన్నాయని మండిపడ్డారు. దీంతో ట్రంప్ అహం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. అందుకేనేమో.. గత కొద్ది రోజులుగా భారత్ పై ప్రేమ కురిపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా.. మోదీ నాకు చాలా మంచి మిత్రుడు.. ఇరు దేశాలకు అంగీకార యోగ్యమైన నిర్ణయాల కోసం చర్చలు కొనసాగుతాయని ట్వీట్ చేశాడు. 

బుధవారం (సెప్టెంబర్ 10) తన ట్రూత్ సోషల్ మీడియా సైట్ లో ట్రంప్ ఇండియాను పొగుడుతూ పోస్ట్ చేశాడు. తాను, మోదీ మంచి ఫ్రెండ్స్ అని.. త్వరలోనే ఇరు దేశాల మధ్య ఉన్న ట్రేడ్ బారియర్స్ ను పరిష్కరించుకుని ముందుకు వెళ్తామని పేర్కొన్నాడు. చర్చలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్లు పోస్ట్ చేశారు ట్రంప్. 

ALSO READ : ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌లో 400 మంది సైంటిస్టులు..

ట్రంప్ పోస్ట్ కు రిప్లై ఇచ్చారు ప్రధాని మోదీ. ఇండియా, అమెరికా మంచి ఫ్రెండ్స్, నేచురల్ పార్ట్ నర్స్.. ఇరుదేశాల పార్ట్ నర్షిప్ కోసం చర్చలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నాను. ట్రంప్ తో చర్చలు జరిపేందుకు నేను కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను.. అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు మోదీ. 

వెంటనే ట్రంప్ స్పందించి.. మోదీ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. తన వైఖరిపై ఇన్నాళ్లు సీరియస్ గా ఉన్న మోదీ.. ఎలా రిప్లై ఇస్తారోనన్న అనుమానంలో ఉన్న ట్రంప్ కు.. మోదీ రిప్లై కాస్త ఉపశమనం కలిగించినట్లుంది. తగ్గే ప్రసక్తే లేదు.. ఇండియా వినకుంటే డబుల్ టారిఫ్ లు ఉంటాయి.. లేదంటే సాంక్షన్స్ ఉంటాయి అంటూ బెదిరిస్తూ వస్తున్న ట్రంప్.. చివరికి రాజీ కోసం ప్రయత్నించే వరకు వచ్చినట్లు గత రెండు మూడు రోజులుగా ఆయన వ్యవహార శైలిని చూస్తే అర్ధమవుతోంది.