వూహాన్ ల్యాబ్​ నుంచే కరోనా ఎస్కేప్

వూహాన్ ల్యాబ్​ నుంచే కరోనా ఎస్కేప్
  • చైనాపై విరుచుకుపడిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్
  • రైతాంగానికి 19 బిలియన్ డాలర్ల ప్యాకేజీ

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మరణ తాండవం చేస్తూ లక్షన్నర మందిని బలిగొన్న కరోనా వైరస్.. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే తప్పించుకుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ‘వాళ్లు (చైనాను ఉద్దేశించి) గబ్బిలం గురించి మాట్లాడతారు. కానీ ఆ గబ్బిలం అక్కడిది కాదు. గబ్బలాన్ని వెట్ జోన్ లో విక్రయించనే లేదు. ఆ గబ్బిలం అక్కడి నుంచి 40 మైళ్ల దూరంలోని వేరే ప్రాంతానికి చెందింది’ అని ట్రంప్ చెప్పారు. కరోనాను ఓడించే క్రమంలో ఆర్థిక మాంద్యం ప్రభావం వ్యవసాయం రంగంపై పడకుండా ఉండటానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ వ్యవసాయ రంగానికి19 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ఆయన శుక్రవారం ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన రైతులతోపాటు గడ్డిబీడు యజమానులకు నేరుగా ఈ పేమెంట్స్ చెల్లించనున్నారు. స్కూళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతోపాటు ప్రజలు ఇంటి భోజనమే తింటుండటంతో అమెరికాలో ఆహార ఉత్పత్తులకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

చైనాలో డెత్ లు ఎక్కువే
వూహాన్ లో కరోనా డెత్ కౌంట్ అక్కడి అధికారులు వెల్లడించిన దాని కంటే ఎక్కువగానే ఉండొచ్చని ట్రంప్ సందేహం వ్యక్తం చేశారు. ‘కరోనా వల్ల ఎంతమంది చనిపోయారనే లిస్టును చైనా రీసెంట్ గా డబుల్ చేసి విడుదల చేసింది. కానీ అది ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. యూఎస్ కంటే అధిక స్థాయిలో చైనా కరోనా మృతుల సంఖ్య ఉండొచ్చు. అమెరికా ఆ లిస్టుకు దరిదాపుల్లో కూడా ఉండకపోవచ్చు’ అని ట్రంప్ పేర్కొన్నారు.

లెవెల్–4 ల్యాబ్ కు గ్రాంట్ లు ఆపేస్తాం
అనేక విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయని వాటిపై దర్యాప్తు జరుగుతోందని ట్రంప్ అన్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. వూహాన్ లోని లెవెల్–4 ల్యాబ్ కు అమెరికా ఇస్తున్న గ్రాంట్ ను నిలిపివేస్తామని చెప్పారు. ఒబామా ప్రభుత్వం ఆ ల్యాబ్ కు 3.7 మిలియన్ డాలర్ల గ్రాంట్ ప్రకటించిదని.. త్వరలోనే ఆ గ్రాంట్ ను ఆపేస్తామని వివరించారు.