
Golden Dome: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలం నుంచి కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా కలుపుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. దీనిపై గతంలోనూ ఆసక్తికర కామెంట్స్ ఆయన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి అమెరికా తన రక్షణ కోసం గోల్డెన్ డోమ్ అనే క్షిపణి డిఫెన్స్ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కొన్ని రోజుల కిందట ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కెనడా కూడా భాగం కావాలంటే 61 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.5 లక్షల కోట్లు చెల్లించాలంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. కెనడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా మారాలని తాను సూచించినట్లు కూడా ట్రంప్ అన్నారు.
అయితే కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా మారేందుకు అంగీకరిస్తే ఎలాంటి డబ్బు చెల్లించకుండానే సున్నా డాలర్లకు అందించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఆఫర్ అంగీకరించటానికి కెనడా ముందుకొస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచరణకు అడ్డంకులు ఉంటాయని వారు చెబుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం రెండవసారి అధ్యక్షుడిగా తాను పదవీ విరమణ చేసే నాటికి ఈ టెక్నాలజీని అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
క్లిష్టమైన ఈ స్పేస్ టెక్నాలజీలో ఇంజనీర్లు రూపొందించే సాఫ్ట్ వేర్లు బాలిస్టిక్ మిస్సైళ్లు, హైపర్ సోనిక్స్, అత్యాధునిక క్రూయిజ్ మిస్సైళ్లు వంటి వాటి నుంచి అమెరికాకు ఏకకాలంలో రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇజ్రాయెల్ రూపొందించిన ఐరన్ డోమ్ లాగా పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే అమెరికా గోల్డెన్ డోమ్ వ్యవస్థపై ఉత్తర కొరియా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ మెుత్తం ఖర్చు 175 బిలియన్ డాలర్లు అంటే రూ.14 లక్షల కోట్ల కంటే ఎక్కువ. కానీ దీనిని స్టార్ట్ చేసేందుకు ముందుగా 25 బిలియన్ డాలర్ల ఫండింగ్ కోసం యూఎస్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చేనాటికి దాని ఖర్చు 542 బిలియన్ డాలర్లు అంటే 44 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేస్తోంది.
అమెరికాలో అంతర్భాగంగా మారితే ఏమీ చెల్లించకుండానే గోల్డెన్ డోమ్ అందిస్తామని ట్రంప్ చేసిన ఆఫర్ తిరస్కరిస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కేర్నీ కార్యాలయం వెల్లడించింది. కెనడా గర్వించదగిన, స్వతంత్ర దేశమని దాని సార్వభౌమత్వాన్ని వదులుకునే ఆలోచనలో అస్సలు లేదని తేల్చి చెప్పేసింది. గోల్డెన్ డోమ్ అనేది అమెరికా తమ దేశంపై జరిగే ఎలాంటి క్షిపణి దాడుల నుంచైనా రక్షణ పొందటానికి రూపొందించుకుంటున్న క్షిపణి రక్షణ వ్యవస్థ అని తెలిసిందే.