రష్యా కాగితం పులి..జెలెన్ స్కీతో భేటీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ కామెంట్

రష్యా కాగితం పులి..జెలెన్ స్కీతో భేటీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ కామెంట్
  • నాటో దేశాలపైకి వస్తే.. రష్యన్ జెట్​లను కూల్చేయాలి

న్యూయార్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి మారింది. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని వదులుకుని, శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ఉక్రెయిన్ కు చెప్తూ వస్తున్న ఆయన తాజాగా మాట మార్చారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తో ఇటీవల అలాస్కాలో భేటీ తర్వాత ఉక్రెయిన్ రాజీపడక తప్పదన్న ధోరణిలో ట్రంప్ మాట్లాడారు. 

కానీ నాటో కూటమిలోని యూరప్ దేశాలు అందించే ఆయుధాల సపోర్ట్ తో ఉక్రెయిన్ యుద్ధం గెలవగలదని, గతంలో రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్నంతా తిరిగి పొందగలదని తాజాగా సానుభూతి వైఖరి ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీతో భేటీ అయిన తర్వాత ట్రంప్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 

నాటో దేశాల గగనతలంపైకి రష్యన్ యుద్ధవిమానాలు వస్తే.. వాటిని కూల్చేయాలని అన్నారు. ఇటీవల నాటో కూటమిలోని పోలెండ్ గగనతలంలోకి రష్యన్ డ్రోన్లు ప్రవేశించగా, వాటిని ఆ దేశం కూల్చేసింది. అలాగే ఎస్టోనియా గగనతలంలోనూ రష్యన్ ఫైటర్ జెట్ లు 12 నిమిషాలపాటు చక్కర్లు కొట్టడంతో నాటో దేశాల్లో కలకలం రేగింది. 

దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు స్పందించారు. మూడున్నరేండ్లుగా రష్యా ఒక లక్ష్యమంటూ లేకుండా యుద్ధం చేస్తోందని ట్రంప్ అన్నారు. అది నిజమైన మిలిటరీ పవర్ అయి ఉంటే.. కేవలం ఒక వారంలోనే యుద్ధంలో గెలిచి ఉండేదన్నారు. ఈ యుద్ధంతో రష్యా పవర్ ఫుల్ కాదని, అది ఒక కాగితం పులి వంటిదని తేలిపోయిందన్నారు.  

ఎలుగుబంటికి మించి: క్రెమ్లిన్ 

ట్రంప్ కామెంట్లను రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ అధికార ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్ బుధవారం ఖండించారు. ‘‘రష్యా కాగితం పులి వంటిది కాదు. ఎలుగుబంటికి మించినది” అని కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్​కు సానుకూలంగా ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. ఇక తమకు యుద్ధం కొనసాగించడం తప్ప వేరే చాయిస్ లేదన్నారు.

భారత్ మా వైపే ఉంది: జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనా నిధులు సమకూరుస్తున్నాయని ట్రంప్ చేసిన కామెంట్లను జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ తోసిపుచ్చారు. ఇండియా మద్దతు తమకే ఉందన్నారు. రష్యాతో భారత్ చమురు ఒప్పందం ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు ఒక సమస్యే అయినప్పటికీ  ట్రంప్ దీనిని పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.