మోదీ వీక్నెస్ కారణంగానే ట్రంప్ బ్లాక్ మెయిల్.. యూఎస్ అదనపు టారిఫ్లపై రాహుల్ ఫైర్

మోదీ వీక్నెస్ కారణంగానే ట్రంప్ బ్లాక్ మెయిల్.. యూఎస్ అదనపు టారిఫ్లపై రాహుల్ ఫైర్

భారత్ పై అమెరికా మరో 25 శాతం టారిఫ్ ను విధించడంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బుధవారం (ఆగస్టు 06) భారత్ పై అదనపు టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే.. ఎక్స్ వేదికగా విమర్శలకు ధ్వజమెత్తారు రాహుల్. 

 ట్రంప్ ఇండియాను ఎకనామిక్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. భారత్ పై ట్రంప్ 50 శాతం సుంకాలను విధించడం ఆర్థికంగా బ్లాక్ మెయిల్ చేయడమేనని అన్నారు. దీనితో ఇండియాను లొంగదీసుకుని తమకు అనుకూలంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ట్రంప్ ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. 

ప్రధాని మోదీ బలహీనతలను ఆధారంగా చేసుకుని ట్రంప్ బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని  మోదీ వీక్ నెస్ కారణంగా భారతీయుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. 

భారత్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 25 శాతం టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. అయితే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపకుంటే 24 గంటల్లో మరో 25 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే ట్రంప్.. భారత్‎పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించారు. తొలుత 2025, జూలై 30న ఇండియాపై 25 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్.. 2025, ఆగస్ట్ 6న మరో 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. 

లేటెస్టుగా విధించిన సుంకాలతో భారత్‌పై మొత్తం 50 శాతానికి టారిఫ్‌లు పెరిగిపోయాయి.  భారతపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తూ బుధవారం (ఆగస్ట్ 6) కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ట్రంప్‌. దీంతో ఇప్పటి నుంచి అమెరికాలో భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు అమలు కానున్నాయి.