కెనడాపై 35% టారిఫ్... లెటర్ పంపిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

కెనడాపై 35% టారిఫ్... లెటర్ పంపిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్
  • కెనడా నుంచి ఫెంటనిల్ డ్రగ్ అక్రమ రవాణాపై మండిపాటు 
  • ఆగస్టు 1 నుంచి పెంచిన టారిఫ్​లు అమలులోకి వస్తాయని వెల్లడి 
  • యూకే, ఈయూ వైపు కెనడా ప్రధాని కార్నీ చూపు 

వాషింగ్టన్/టొరంటో: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాపై టారిఫ్​లు పెంచారు. ఫెంటనిల్ డ్రగ్ అక్రమ రవాణాను కెనడా అడ్డుకోవడంలేదని, అలాగే తమ దేశంతో వాణిజ్య లోటు కూడా భారీగా ఉందంటూ గత మార్చిలో ట్రంప్ 25% సుంకాలు విధించారు. తాజాగా మరోసారి ఇవే కారణాలను చూపుతూ.. ఈ టారిఫ్​లను 35 శాతానికి పెంచామని, పెంచిన టారిఫ్​లు ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తాయంటూ కెనడా ప్రధాని మార్క్ కార్నీకి ఆయన తాజాగా లేఖ రాశారు. 

ఫెంటనిల్ డ్రగ్ తో అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, ఈ డ్రగ్ అక్రమ రవాణాను కెనడా అడ్డుకోవడంలేదని మండిపడ్డారు. ‘‘కెనడాతో ఫెంటనిల్ డ్రగ్ అంశమే అతిపెద్ద సవాలుగా ఉంది. అలాగే నాన్ టారిఫ్ పాలసీలు, ట్రేడ్ బ్యారియర్లు కూడా ఉన్నాయి” అని లేఖలో పేర్కొన్నారు. అయితే, అమెరికాతో కొత్త ట్రేడ్ డీల్ కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని కెనడా ప్రధాని కార్నీ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. అదేసమయంలో కెనడా కార్మికులు, వ్యాపార సంస్థల ప్రయోజనాలను మాత్రం కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ లేఖకు ముందు కూడా కార్నీ ‘ఎక్స్’లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ‘‘వాణిజ్య సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు కెనడా వంటి నమ్మకమైన ఆర్థిక భాగస్వామి వైపు చూస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు. తాము యూరోపియన్ యూనియన్, యూకేతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కాగా, ట్రంప్ ఇటీవల మెక్సికో, బ్రెజిల్, జపాన్, సౌత్ కొరియా, శ్రీలంక, మయన్మార్ సహా 23 దేశాలకు టారిఫ్ లెటర్లు పంపారు. మెక్సికో వస్తువులపై 25%, బ్రెజిల్ వస్తువులపై 50% సుంకాలు విధిస్తున్నట్టు తెలిపారు.   

మాపై సుంకాలు తగ్గించండి: మయన్మార్ 

తమ దేశం నుంచి ఎగుమతి చేసే వస్తువులపై విధించిన 40 శాతం టారిఫ్​లను తగ్గించాలని ట్రంప్ కు మయన్మార్ జుంటా (మిలిటరీ సర్కార్) చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ హిలాంగ్ విజ్ఞప్తి చేశారు. మయన్మార్ వస్తువులపై అమెరికా 10 శాతం నుంచి 20 శాతానికి టారిఫ్​లు తగ్గిస్తే.. తాము కూడా అమెరికన్ వస్తువులపై టారిఫ్​లను 0 నుంచి 10 శాతానికి తగ్గిస్తామని ప్రతిపాదించారు. అవసరమైతే చర్చల కోసం ప్రతినిధి బృందాన్ని అమెరికాకు పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేసినట్టు శుక్రవారం ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది.