ఓటమిని ట్రంప్ ఒప్పుకోవాలి: ఒబామా

ఓటమిని ట్రంప్ ఒప్పుకోవాలి: ఒబామా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోవాలన్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఫలితాలు వచ్చిన రోజు కానీ, మరో రెండు రోజుల తర్వాత కానీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించి ఉంటే బాగుండేదన్నారు. ఎన్నికల ఫలితాలలో వచ్చిన నంబర్లను చూస్తే… జో బైడెన్ అధ్యక్షుడు కావడానికి కావాల్సినంత మెజార్టీని సాధించారని తెలిపారు. ట్రంప్ తన అహాన్ని వీడి బైడెన్ కు అధికార పగ్గాలను అప్పగించాలన్నారు. దేశాధ్యక్షుడు అంటే ఒక ప్రజా సేవకుడని… కొంత కాలం మాత్రమే అధ్యక్షుడి కార్యాలయంలో ఉంటారని, అది పర్మినెంట్ పోస్ట్ కాదన్నారు.

ఈ ఎన్నికల్లో దేశం రెండు భాగాలుగా విడిపోయిందని ఒబామా అన్నారు. అమెరికా సంయుక్త రాష్టాలుగానే మన దేశ విదేశాంగ విధానాలు ఉంటాయని… అమెరికా అసంయుక్త రాష్ట్రాలుగా విధానాలు ఉండవని చెప్పారు. డెమోక్రాట్లలో కానీ, రిపబ్లికన్లలో కాని ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ను తాను ఎన్నడూ చూడలేదన్నారు ఒబామా. వ్యవస్థలను ఆయన దెబ్బతీశారని చెప్పారు. నియమ, నిబంధనలను పట్టించుకోని వ్యక్తి చేతిలో అధికారం ఎంతో కాలం ఉండబోదన్నారు.

అమెరికా బలహీనపడిందని ప్రత్యర్థి దేశాలు భావిస్తున్నాయని… కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాలే దీనికి కారణమన్నారు ఒబామా.