పీవోకేపై మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: తేల్చి చెప్పిన భారత్

పీవోకేపై మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: తేల్చి చెప్పిన భారత్

న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్ ‘కశ్మీర్’ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘కశ్మీర్’ అంశంలో ఇండియా, పాక్ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే భారత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ట్రంప్ ఆఫర్ను పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్వాగతించినప్పటికీ ఇండియా మాత్రం ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని ఇండియా కరాఖండిగా చెప్పేసింది.

‘కశ్మీర్’ అంశంపై కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదని, పాక్ ఆక్రమిత కశ్మీర్ను (PoK) భారత్కు తిరిగివ్వడం ఒక్కటే మిగిలి ఉందని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఇంతకు మించి ఏదైనా మాట్లాడదలచుకుంటే ఉగ్రవాదులను భారత్కు అప్పగించాకే చర్చలకు అవకాశం ఉంటుందని పాకిస్తాన్కు భారత్ తేల్చి చెప్పింది. 

భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ముందుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను మధ్యవర్తిత్వం వహించి ఇరుదేశాల ప్రధానులతో రాత్రంతా చర్చలు జరిపానని వెల్లడించారు. ‘‘తక్షణమే పూర్తి స్థాయి కాల్పుల విరమణ పాటించేందుకు భారత్, పాక్ అంగీకరించాయని ప్రకటించేందుకు సంతోషిస్తున్నా.

కామన్ సెన్స్, గొప్ప తెలివితేటలను ప్రదర్శించిన ఆ రెండు దేశాలకూ నా అభినందనలు. ఈ విషయంలో మీరు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు” అని ట్రంప్ ఈ మేరకు శనివారం సాయంత్రం 5.25 గంటలకు (అమెరికా టైం ప్రకారం ఉదయం 8 గంటలకు) ట్రూత్ సోషల్ లో సంచలన పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే భారత్, పాక్ విదేశాంగ శాఖల నుంచి కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ప్రకటనలు వచ్చాయి.