V6 News

ఇరాన్ ప్రపోజల్కు ట్రంప్ నో... ‘అణు’ చర్చలు చివర దశలో పెట్టడంపై అభ్యంతరం

ఇరాన్ ప్రపోజల్కు ట్రంప్ నో... ‘అణు’ చర్చలు చివర దశలో పెట్టడంపై అభ్యంతరం
  •     ఆ ప్రతిపాదన తమకు ఓటమిగా కనిపిస్తుందన్న యూఎస్

న్యూయార్క్: మూడు దశలతో ఇరాన్ చేసిన కొత్త శాంతి ప్రపోజల్​ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్ తిరస్కరించారు. అణు చర్చలు చివరి దశలో చేర్చడం సరికాదని.. ముందుగా ఆ అంశంపైనే చర్చలు జరగాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలాంటి ప్రపోజల్ ప్రకారం వెళ్లి ఇరాన్​తో ఒప్పందం చేసుకుంటే అది యూఎస్ ఓటమిగా కనిపిస్తుందని అమెరికా అధికారుల్లో కొందరు చెప్తున్నారు. 

ఫస్ట్ స్టేజ్​లో కాల్పుల విరమణతో యుద్ధాన్ని పూర్తిగా ఆపేయడం, రెండో దశలో హార్మూజ్ జలసంధిని తెరవడం, మూడో స్టేజ్​లో అణు అంశంపై చర్చలు అని ఇరాన్ ప్రపోజల్​లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై సోమవారం వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూమ్‌లో తన సలహాదారులతో ట్రంప్ చర్చించారు. గత వారం కూడా ఇరాన్ పంపిన ఒక ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చుతూ.. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే అమెరికా అధికారుల్లో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రెండు నెలలు జలసంధి మూసివేస్తే ఇరాన్ చమురు రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని, అప్పుడు ఇరాన్ ఒప్పందానికి అంగీకరిస్తుందని కొందరు అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొందరు అధికారులు ఈ అంచనా తప్పు అని, ఇరాన్ స్థానం బలంగా ఉందని అంటున్నారు. ‘‘ఇరాన్ తరఫున చర్చలకు వచ్చే ప్రతినిధులు కేవలం మాట్లాడడానికే వస్తారు. ‘ఓకే, ఈ షరతుకు ఒప్పుకుంటాం’ అని చెప్పే స్వేచ్ఛ వారికి లేదు. అసలు నిర్ణయం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చేతుల్లో ఉంటుంది. అతను అనుమతి ఇస్తేనే ఒప్పందం జరుగుతుంది” అని వైట్ హౌస్ ప్రతినిధి ఒలీవియా వెల్స్ తెలిపారు.