భారత్‌‌కు దూరమైనం.. రష్యాతోనూ సంబంధాలు దెబ్బతిన్నయ్

భారత్‌‌కు దూరమైనం.. రష్యాతోనూ సంబంధాలు దెబ్బతిన్నయ్

 

  • అమెరికా ప్రెసిడెంట్​ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
  •     ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్లిపోయాయ్​
  •     3 దేశాలు కలిసి కలకాలం వర్ధిల్లాలంటూ సెటైర్
  •     3 దశాబ్దాల 3 యుద్ధాలను ఆపానని వెల్లడి

వాషింగ్టన్‌‌‌‌:  టారిఫ్‌‌‌‌ల వేళ భారత్‌‌‌‌–అమెరికా సంబంధాలపై  ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు దిగజారాయని పేర్కొన్నారు. అలాగే, రష్యాతోనూ రిలేషన్​ దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోషల్​ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ‘ట్రూత్’ లో ట్రంప్​ పోస్ట్​ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రెసిడెంట్​ జిన్‌‌‌‌పింగ్‌‌‌‌, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి దిగిన ఫొటోను షేర్​ చేశారు. ‘‘భారత్‌‌‌‌, రష్యాలను మనం వక్రబుద్ధి కలిగిన చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తున్నది. ఆ రెండు దేశాలు డ్రాగన్​ చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ మూడు దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అని  ట్రంప్​ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  ఇటీవల చైనాలోని తియాంజిన్‌‌‌‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌‌‌‌సీవో) సదస్సులో మోదీ, జిన్‌‌‌‌పింగ్‌‌‌‌, పుతిన్  వేదిక పంచుకున్న విషయం తెలిసిందే.  ఆయా దేశాల ద్వైపాక్షిక అంశాలపై ఆ సమావేశాల్లో చర్చించారు. ట్రంప్‌‌‌‌ తీరువల్లే ఆ 3 దేశాలు ఒక్కటయ్యాయనే వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో మిత్ర దేశంగా ఉన్న భారత్‌‌‌‌ను తాము కోల్పోయినట్టు ట్రంప్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ట్రంప్‌‌‌‌ వ్యాఖ్యలపై నో కామెంట్స్: భారత్‌‌‌‌

భారత్‌‌‌‌తో సంబంధాలు దెబ్బతిన్నట్టు అర్థం వచ్చేలా ట్రంప్​ చేసిన కామెంట్స్‌‌‌‌పై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించేందుకు నిరాకరించింది. శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో ట్రంప్​ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్స్ చేయలేమని తెలిపింది. కాగా, ట్రంప్‌‌‌‌–మోదీ మధ్య గాఢమైన వ్యక్తిగత బంధం క్షీణించిపోయిందంటూ యూఎస్​ నేషనల్‌‌‌‌ సెక్యూరిటీ మాజీ అడ్వైజర్​ జాన్‌‌‌‌ బోల్టన్​ వ్యాఖ్యానించారు. 

అమెరికాలో ఎంత ఇన్వెస్ట్​ చేస్తారు?

అమెరికాలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తారని ఆపిల్‌‌‌‌ సీఈవో టిమ్‌‌‌‌ కుక్‌‌‌‌ను ట్రంప్‌‌‌‌ ప్రశ్నించారు. అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈవోలకు అధ్యక్షుడు  వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లో డిన్నర్‌‌‌‌  ఏర్పాటు చేశారు. దీనికి టిమ్‌‌‌‌కుక్‌‌‌‌తోపాటు గూగుల్​ సీఈవో సుందర్‌‌‌‌ పిచాయ్‌‌‌‌, మెటా సీఈవో జుకర్‌‌‌‌బర్గ్‌‌‌‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, ఓపెన్​ ఏఐ సీఈవో సామ్‌‌‌‌ ఆల్ట్‌‌‌‌మాన్‌‌‌‌ లాంటి  టెక్‌‌‌‌ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్‌‌‌‌ వారిని సూటిగా ప్రశ్నించారు. ‘‘టిమ్..  అమెరికాలో ఆపిల్ ఎంత పెట్టుబడి పెడుతుంది? అది చాలా పెద్ద మొత్తం అని నాకు తెలుసు. నువ్వు ఇంతకు ముందు వేరే చోట ఉండేవాడివి, ఇప్పుడు నిజంగా చాలా పెద్ద మొత్తంతో ఇంటికి వస్తున్నావు. ఇంతకూ ఎంత ఇన్వెస్ట్​ చేస్తున్నవ్​?” అని అడిగారు.  దీనికి టిమ్‌‌‌‌ కుక్‌‌‌‌ సమాధానం ఇస్తూ.. అమెరికాలో 600 బిలియన్‌‌‌‌ డాలర్లు (రూ. 50.4 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు చెప్పారు. అలాగే, తాము కూడా 600 బిలియన్​ డాలర్టు ఇన్వెస్ట్​ చేయనున్నట్టు మెటా సీఈవో జుకర్‌‌‌‌‌‌‌‌బర్గ్​ తెలిపారు. తాము 100 బిలియన్‌‌‌‌ డాలర్లు (రూ.21లక్షల కోట్లు) పెట్టుబడి పెడతామని సుందర్​పిచాయ్​,  తాము 75 నుంచి 80 బిలియన్ డాలర్లు (సుమారు 6.72 లక్షల కోట్లు)  అని సత్య నాదెళ్ల సమాధానం ఇచ్చారు. ‘చాలా మంచిది’ అంటూ అందరికీ ట్రంప్​ కృతజ్ఞతలు తెలిపారు.

మూడు యుద్ధాలను ఆపేశాను​

ఇప్పటివరకూ తాను 3 యుద్ధాలను ఆపానని డొనాల్డ్ ట్రంప్​ తెలిపారు.  టెక్‌‌‌‌ సంస్థల అధిపతులు, సీఈవోలకు విందు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ముగింపుపై విలేకరులు ప్రశ్నించారు. దీనికి ట్రంప్ సమాధానమిస్తూ.. ‘‘మీకు తెలుసా?.. నేను ఇప్పటివరకూ 3 యుద్ధాలను ఆపాను. అందులో ఒకటి 31 ఏండ్లుగా సాగుతున్నది. ఈ యుద్ధంలో కోటి మంది దాకా చనిపోయారు. రెండోది 34, మూడోది 37 ఏండ్లుగా కొనసాగుతున్నాయి. ఆ యుద్ధాలను నేను ఆపలేరన్నారు. కానీ, వాటన్నింటినీ నేను ఆపా”అని వ్యాఖ్యానించారు. 

మౌంట్‌‌‌‌ రష్మోర్‌‌‌‌పై ట్రంప్​ కన్ను


అమెరికాలో ప్రముఖ నాయకుల ముఖాలను చెక్కిన ‘మౌంట్‌‌‌‌ రష్మోర్‌‌‌‌’ కొండపై ట్రంప్​ కన్నుపడింది. ఇప్పటికే నోబెల్​శాంతి బహుమతి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆయన.. ఈ కొండపై తన ముఖాన్ని చెక్కించుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా మౌంట్‌‌‌‌ రష్మోర్‌‌‌‌‌‌‌‌పై తన చిత్రంతో కూడిన ఓ ఏఐ వీడియోను ట్రంప్ తాజాగా సోషల్​ మీడియాలో షేర్​ చేశారు.  కొండపై మాజీ అధ్యక్షులు జార్జి వాషింగ్టన్‌‌‌‌, థామస్‌‌‌‌ జెఫర్సన్‌‌‌‌, రూస్‌‌‌‌వెల్ట్‌‌‌‌, అబ్రహం లింకన్‌‌‌‌ పక్కనే తన ముఖం ఉన్నట్టు వీడియోలో చూపించారు. కాగా,  ఆ పర్వతంపై  ఐదో ముఖం చెక్కడానికి చోటు సరిపోదని అమెరికా అధికారులు అంటున్నారు.  మౌంట్‌‌‌‌ రష్మోర్‌‌‌‌ను నిర్వహించే నేషనల్‌‌‌‌ పార్క్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కూడా అక్కడ ఐదో తల ఏర్పాటుకు సురక్షిత ప్రదేశం లేదని వెల్లడించినట్టు న్యూయార్క్‌‌‌‌ టైమ్స్ కథనంలో పేర్కొన్నది.