
- న్యూక్లియర్ మిసైల్స్‌తో యుద్ధాలు వద్దని చెప్పిన
- ఇద్దరు ప్రధానులను డిన్నర్‌కు పిలుస్తానన్న అమెరికా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే.. ఆ రెండు దేశాలు కలిసి డిన్నర్ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. న్యూక్లియర్ మిసైల్స్‌తో యుద్ధాలు వద్దని సూచించారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని మరోసారి ప్రకటించారు. అమెరికా జోక్యం కారణంగానే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అన్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. మిడిల్ ఈస్ట్ పర్యటనలో భాగంగా యూఎస్, సౌదీ అరేబియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం సదస్సులో ట్రంప్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇండియా ప్రధాని మోదీ, పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ను ఒకరోజు డిన్నర్‌కు పిలుస్తా. ఇండియా, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం నివారించడానికి నా మధ్యవర్తిత్వం ఎంతో సహాయపడింది. ఇది లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. మార్కో రూబియో, వాళ్లు కలిసి బయటకు వెళ్లి డిన్నర్ చేసుకోవచ్చు’’ అని ట్రంప్ అన్నారు. రెండు దేశాల మధ్య చరిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో అమెరికా విజయవంతమైందని తెలిపారు.
జెట్ వద్దని చెప్తున్న ట్రంప్ వింటలే..
ట్రంప్‌కు ఖతార్ రాజకుటుంబం గిఫ్ట్‌గా ఇవ్వనున్న లగ్జరీ బోయింగ్ 747- జంబో జెట్ విషయంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నా.. ట్రంప్ వినిపించుకోవడం లేదు. ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైన్‌తో రూపొందించిన ఈ విమానం.. ఓ ప్యాలెస్‌ను తలపిస్తుంది. దీని ఖరీదు రూ.3,400 కోట్లు. ఇలాంటి విదేశీ గిఫ్ట్‌లతో కేవలం అధ్యక్షుడిపైనే కాకుండా ఆయనతో ప్రయాణించేవారిపై నిఘా, ట్రాకింగ్, కమ్యూనికేషన్లలోకి చొరబడే అవకాశం ప్రత్యర్థులకు ఇచ్చినట్లవుతుందనే వాదనలున్నాయి.
మీరు రాత్రిళ్లు ఎలా పడుకుంటరు?
సౌదీ, అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్ వేదికగా సౌదీ రాకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ట్రంప్ విచిత్రమైన ప్రశ్న వేశారు. ‘‘మీరు రాత్రిళ్లు అసలు నిద్రపోతారా? ఎలా పడుకుంటారు?’’ అని ప్రశ్నించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌదీని ఎంతో గొప్పగా చేశారని, తమలో ఒకరిలా ఉంటూనే.. ఇంతలా ఎలా అభివృద్ధి చేశారని మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను ట్రంప్ ప్రశ్నించారు.
అసలు సౌదీ డెవలప్ అవుతుందా? అని చాలా మంది విమర్శించారని, కానీ.. అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. కాగా, మిడిల్ ఈస్ట్ పర్యటనలో భాగంగా సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ శరాతో ట్రంప్ భేటీ అయ్యారు. రియాద్‌లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సమావేశంలో సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.